Dubai Island Sale:

ఐల్యాండ్‌ ఫర్ సేల్

ఇల్లు కొనాలంటే ముందు మనం ఆ ఏరియా ఎలా ఉంది..? బిల్డింగ్ డిజైన్ బాగుందా..? డాక్యుమెంట్‌ల సంగతేంటి..? ఇలా ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం. ఆ తరవాతే కొనాలా లేదా అని డిసైడ్ అవుతాం. కాస్తంత లగ్జరియస్ అపార్ట్‌మెంట్‌ల కోసం ఎక్కువే ఖర్చు చేయాల్సి వస్తుంది. పైగా ఈ మధ్య అన్ని చోట్లా రేట్‌లు పెరిగిపోతున్నాయి. అయినా కోట్లు పెట్టి కొంటున్నారు జనాలు. చూడటానికి రిచ్‌గా ఉంటే ఇంటికి అంత ఖర్చు చేశారంటే అనుకోవచ్చు. కానీ ఇసుక కోసం ఎవరైనా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారా..? అంత పెట్టి ఇసుకను కొనుక్కుంటారా..? అంత తెలివి తక్కువ పని ఎవరు చేస్తారు అనుకోకండి. అలాంటి వాళ్లు కూడా ఉన్నారు. ఇసుక పోసి కృత్రిమంగా తయారు చేసిన ఓ ఐల్యాండ్‌ని (Dubai Island) కోట్లు పెట్టి మరీ కొన్నాడు దుబాయ్‌కి చెందిన ఓ వ్యక్తి. అక్కడి మార్కెట్‌లో ఇదో రికార్డు. ఆ ద్వీపాన్ని కొనుగోలు చేసేందుకు రూ.3.4 కోట్లు ఖర్చు పెట్టాడు. 24,500 స్క్వేర్ ఫీట్‌ల స్థలం అది. దుబాయ్‌ మెయిన్‌ ల్యాండ్‌కి ఈ ద్వీపానికి మధ్యలో బ్రిడ్జ్ కూడా ఉంది. సో...ట్రావెలింగ్‌కి కూడా పెద్ద ఇబ్బంది లేదు. అందుకే అంతగా అక్కడ డిమాండ్ పెరిగింది. స్క్వేర్ ఫీట్‌కి 5 వేల దిర్హాంలు ఫిక్స్ చేశారు. అయితే...ఈ ఐల్యాండ్‌ని ఎవరు కొన్నారన్న వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఇది కొన్నది UAE వ్యక్తి కాదని మాత్రం తెలుస్తోంది. కేవలం హాలిడేలో ఎంజాయ్ చేసేందుకు ఆ వ్యక్తి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాడట. ఫ్యామిలీతో పాటు వెకేషన్‌కి వచ్చినప్పుడు ఇక్కడే ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడట. 

భారీ లాభాలు 

సాధారణంగా విల్లాలకు ఈ స్థాయిలో ధర ఉంటుంది. కానీ మెల్లగా ఆ ట్రెండ్‌ పోయి ఏకంగా ఐల్యాండ్‌లనే కొనే ట్రెండ్ వచ్చేసింది. అందుకే భారీ స్థలాలన్నీ క్రమంగా అమ్ముడుపోతున్నాయి. పైగా ఈ ఐల్యాండ్‌లలో భూమి వాల్యూ భారీగా పెరుగుతోంది. కొందరు ఇన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా వీటిని కొని మళ్లీ కోట్ల రూపాయల లాభానికి అమ్ముకుంటున్నారు. దుబాయ్‌లో క్రైమ్ రేట్ తక్కువ. ప్రాపర్టీ ట్యాక్స్‌లు కూడా తక్కువే. అందుకే మిలియనీర్లు ఇక్కడ స్థలాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా..ఆ దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ అనూహ్యంగా పెరిగింది. రష్యన్స్ కూడా ఇక్కడ ప్రాపర్టీలు కొంటున్నారు. పైగా దుబాయ్‌ గోల్డెన్ వీసాలు ఇచ్చి మరీ అలాంటి వాళ్లకు వెల్‌కమ్ చెబుతోంది. కొన్ని ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ప్రాపర్టీలను ఇప్పుడు భారీ లాభానికి అమ్ముకుంటున్నారు. ఆ ప్లేస్‌లో విలాసవంతమైన భవనాలు కట్టుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి దుబాయ్‌లో ఇదో లాభసాటి వ్యాపారమైపోయింది. ప్రభుత్వం కూడా పెద్దగా ఆంక్షలు పెట్టకపోవడం వల్ల బిజినెస్ బాగానే సాగుతోంది. వీలైనంత భారీ సంఖ్యలో ఐల్యాండ్‌లను తయారు చేస్తున్నాయి కొన్ని సంస్థలు. 

Also Read: Water Metro in India: పడవల్లాంటి మెట్రోలు వచ్చేస్తున్నాయ్,మన దేశానికే ఇది వెరీ స్పెషల్