రష్యా వాయువ్య ప్రాంతంలోని పోస్కోవ్‌ సిటీలో డ్రోన్‌ దాడి జరిగింది. నగరంలోని విమానాశ్రయంపై డ్రోన్‌తో బాంబుల దాడి జరిగింది. దీంతో విమానాశ్రయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. నాలుగు విమానాలు మంటల్లో కాలిపోయాయని అధికారులు బుధవాదం వెల్లడించారు. ఇల్యుషిన్‌ 76 సైనిక రవాణా విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని రష్యా వార్తా సంస్థలు వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్‌లో పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించాయి. భారీగా మంటలు చెలరేగుతున్న వీడియోలు విడుదల చేశారు. దాడిని రష్యా మిలిటరీ తిప్పికొడుతోందని స్థానిక గవర్నర్‌ మిఖాయిల్‌ వెడెర్నికోవ్‌ వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. 


పోస్కోవ్‌ సిటీ ఉక్రెయిన్‌కు దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎస్తోనియా సరిహద్దుకు సమీపంలో ఉంటుంది. అయితే ఈ దాడుల విషయంపై ఉక్రెయిన్‌ స్పందించలేదు. ఇటీవల కాలంలో రష్యా టార్గెట్స్‌పై దాడి చేసేందుకు ఉక్రెయిన్ ఎక్స్‌ప్లోజివ్‌ డ్రోన్స్‌ పెంచాలనుకుంటున్నట్లు ఉక్రెయిన్‌ భావించినట్లు సమాచారం. అయితే ఈ దాడిపై మాత్రం ఉక్రెయిన్‌ స్పందించలేదు. తాము దాడి చేసినట్లు చెప్పలేదు. 


మాస్కో సమయం ప్రకారం అర్థరాత్రి తర్వాత నల్ల సముద్రంపై రష్యా మిలిటరీ ఉక్రెయిన్‌ పడవలపై దాడి చేసినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో 50 మందితో ఉన్న నాలుగు పడవలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. అలాగే రష్యా మిలిటరీ బ్రయాన్స్క్‌లోని దక్షిణ ప్రాంతంపై మూడు ఉక్రెయిన్‌ డ్రోన్లను,  ఓరియోల్‌ ప్రాతంలో మరో డ్రోన్‌ను కూల్చివేసినట్లు తెలిపింది. అయితే దీనిపై ఉక్రెయిన్‌ మాత్రం స్పందించలేదు. మాస్కోలోని వ్నుకోవ్‌ విమానాశ్రయంపై ఉన్న గగనతలాన్ని మూసివేసినట్లు రష్యా వార్తా సంస్థ ఒకటి వెల్లడించింది.


2022 ఫిబ్రవరి నుంచి రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అమెరికా ఆధ్వర్యంలోని నాటో దేశాలు ఉక్రెయిన్‌ భూభాగాన్ని రష్యాకి వ్యతిరేక కేంద్రంగా మలుచుకోకుండా చేయడమే ధ్యేయంగా పుతిన్‌ ఈ యుద్ధాన్ని ప్రారంభించారు. దాడులు, ప్రతి దాడులతో చాలా ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌ తీవ్రంగా నష్టపోయింది. రెండు వైపులా ప్రాణ, ఆస్తి నష్టాలు తీవ్రంగా సంభవించాయి. ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలను రష్యా ఆక్రమించింది కూడా. యుద్ధాన్ని ఆపేందుకు పలు దేశాలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.