Supreme Court Advises Caution In Physical Relations: వివాహానికి ముందు శారీరక సంబంధాలు ,నమ్మకం విషయంలో సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనే ఆరోపణలతో నమోదైన ఒక అత్యాచార కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది.
పెళ్లికి ముందే ఎవరినీ నమ్మొద్దు
వివాహానికి ముందు అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు పూర్తిగా అపరిచితులు అని, అలాంటి సమయంలో శారీరక సంబంధాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. మేము పాతకాలపు ఆలోచనల వాళ్లమేమో కానీ.. పెళ్లికి ముందు శారీరక సంబంధంలోకి ఎలా వెళ్తారో మాకు అర్థం కావడం లేదు అని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. జీవితంలో ముఖ్యమైన బంధం ఏర్పడకముందే ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని, అప్రమత్తత అవసరమని ధర్మాసనం హితవు పలికింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక బంధం ఈ కేసులో బాధితురాలు, నిందితుడు 2022లో ఒక మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా పరిచయమయ్యారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అతను ఢిల్లీ, దుబాయ్‌లలో ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఏకాంత వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడని బాధితురాలు ఆరోపించింది. అయితే, ఆమె వివాహంపై అంత కట్టుబడి ఉంటే పెళ్లికి ముందే అతనితో కలిసి దుబాయ్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. వివాహానికి ముందే అంత దూరం ప్రయాణించడం చూస్తుంటే అది పరస్పర సమ్మతితో కూడిన సంబంధంగానే కనిపిస్తోందని అభిప్రాయపడింది.
సమ్మతితో కూడిన సంబంధం vs అత్యాచారం
పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకున్నాక, అది బెడిసికొట్టినంత మాత్రాన అత్యాచారం కింద కేసులు పెట్టడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. కేవలం శారీరక వాంఛ తీర్చుకోవడానికే, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండా మోసపూరితంగా హామీ ఇస్తేనే అది రేప్ కిందకు వస్తుందని వివరించింది. సమ్మతితో కూడిన సంబంధాలు విఫలమైనప్పుడు వాటిని నేర శిక్షలకు గురిచేయడం నేర న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేయడమేనని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసును విచారణ చేసి శిక్షలు విధించే కన్నా, ఇరుపక్షాలను మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. వివాహం విషయంలో ఆ వ్యక్తికి అప్పటికే పెళ్లి అయిందని, మళ్ళీ వేరే వివాహం చేసుకున్నాడని తెలుస్తున్నందున, ఇరుపక్షాల వాదనలను బుధవారం మరోసారి వింటామని పేర్కొంటూ కేసును వాయిదా వేసింది. వ్యక్తిగత సంబంధాలు బెడిసికొట్టినప్పుడు చట్టాన్ని ఆయుధంగా వాడటం కన్నా, సంయమనం పాటించాలని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
