India US Trade Deal:  ఇండియాతో వాణిజ్య ఒప్పందం త్వరలో కుదురుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.  భారత వస్తువులపై టారిఫ్‌లు తగ్గిస్తామన్నారు.  డొనాల్డ్ ట్రంప్ మంగళవారం అమెరికాలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భారతదేశంతో వాణిజ్య ఒప్పందం  త్వరలో ఉంటుందని  ప్రకటించారు. భారత వస్తువులపై విధించిన టారిఫ్ రేట్లను "చాలా త్వరలో" తగ్గించనున్నామని  స్పష్టం చేశారు. 

Continues below advertisement

"ఇప్పుడు వారు నన్ను ప్రేమించడం లేదు. కానీ మళ్లీ మమ్మల్ని  ప్రేమిస్తారు" అని ఇండియాను ఉద్దేశించి ట్రంప్ ఆసక్తికరంగా మాట్లాడారు. "  న్యాయమైన ఒప్పందంపై చర్చలు జరుపుతున్నామని... అందరికీ లాభదాయకమైన ఒప్పందంపై చర్చిస్తున్నామని.. చాలా దగ్గరలో  డీల్ కుదురుతుందని" ట్రంప్ చెప్పారు.   

భారతదేశం రష్యన్ ఆయిల్ దిగుమతులను తగ్గించడంతో అమెరికా  అనుకూలంగా మారింది. "భారత్ రష్యన్ ఆయిల్ దిగుమతులను చాలా తగ్గించింది. ఇది మా ఒప్పందానికి సహాయపడుతోంది" అని ట్రంప్ వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో " అద్భుతమైన స్నేహం " ఉందని ట్రంప్ చెబుతున్నారు. ట్రేడ్ డీల్  2025 చివరి నాటికి కుదిరే అవకాశం ఉందని అమెరికా వర్గాలు చెబుతున్నాయి.  ట్రంప్  ప్రకటనతో భారత-అమెరికా వాణిజ్య సంబంధాలు మరింత బలపడనున్నాయని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు.     

  ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత   జనవరి 2025 నుంచి అమెరికా విదేశీ వాణిజ్య భాగస్వాములపై టారిఫ్‌లను పెంచే విధానాన్ని ప్రవేశపెట్టారు. భారతదేశంపై  టారిఫ్‌లు విధించారు, ఇది భారత వస్తువుల ఎగుమతులకు సమస్యగా మారింది. ఇటీవల భారత్ రష్యన్ ఆయిల్ దిగుమతులను 30% తగ్గించడంతో, అమెరికా దానికి ప్రతిస్పందనగా టారిఫ్‌లు తగ్గించే అవకాశం ఏర్పడింది.  గతంలోనే ట్రేడ్ డీల్ వైపు చాలా సార్లు చర్చలు జరిగినా.. కొన్ని అంశాల్లో స్పష్టత రాకపోవడంతో ... ఎప్పటికప్పుడు ఆగిపోతూ వచ్చింది.