Bharat Jodo Yatra in Rajasthan:
అలా పోల్చడం తప్పు: రాహుల్
రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు రాహుల్ గాంధీ. ఈ సమయంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదేపదే గతం గురించి తవ్వుకోవడం మానేయాలని, ఇకపై ఏం చేయాలో ఆలోచించాలని సూచించారు. కొందరు తనను మహాత్మా గాంధీతో పోల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. "ఇది చాలా తప్పు. మహాత్మా చేసిన పోరాటం వేరు. మనం చేస్తోంది వేరు. ఒకదానితో ఒకటి పోల్చడం సరికాదు. గాంధీజీ చాలా గొప్ప వ్యక్తి. దేశ స్వాతంత్య్రం
కోసం తన జీవితాన్నే పణంగా పెట్టారు. 10-12 ఏళ్లు జైల్లోనే ఉన్నారు. ఆయన చేసిన త్యాగాన్ని ఇంకెవరూ చేయలేరు. ఆయన స్థాయినీ ఎవరూ అందుకోలేరు. ఆయనతో నన్ను పోల్చడం మానుకోండి" అని సున్నితంగానే పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఇదే సమయంలో రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ సేవల్నీ గుర్తు చేశారు. "రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ తమ వంతు దేశానికి సేవ చేశారు. అమరవీరులయ్యారు. కానీ..మనం సమావేశమైన ప్రతి సారీ వాటి గురించే మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ ఇలా అందరూ వాళ్లు ఏమేం చేయగలరో అంతా చేశారు. మనం కూడా ఏం చేయగలమన్నదే ఆలోచించాలి. దానిపైనే దృష్టి పెట్టాలి. ప్రజల కోసం మనం ఏం చేస్తున్నాం అనేది గమనించాలి" అని చెప్పారు. ప్రస్తుతానికి రాజస్థాన్‌లో జోడో యాత్ర కొనసాగుతోంది. ఇందులో రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. ఇటీవలే RBI మాజీ గవర్నర్ రఘురాం రాజన్ యాత్రలో పాలు పంచుకున్నారు. రాహుల్ గాంధీతో చాలా సేపు ముచ్చటించారు. బుధవారం ఉదయం రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపుర్ నుంచి రాహుల్ 'జోడో యాత్ర' ప్రారంభమైంది. ఆ సమయంలో రఘురామ్ రాజన్.. నడుస్తూనే రాహుల్ గాంధీ పలు అంశాలపై చర్చించారు.
జోరుగా యాత్ర..
నోట్ల రద్దు నుంచి మోదీ సర్కార్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలను రఘురామ్ రాజన్ బహిరంగంగానే విమర్శలు చేశారు. నోట్ల రద్దును వ్యతిరేకించడంలో కాంగ్రెస్‌కు రఘురామ్ రాజన్ మద్దతిచ్చారు. ఇలాంటి నిర్ణయాల వల్ల దీర్ఘకాల ప్రయోజనాలకు ఆటంకం కలుగుతుందని తాను రాసిన ఓ పుస్తకంలో పేర్కొన్నారు. 'భారత్ జోడో యాత్ర' రాజస్థాన్‌లో ఉత్సాహంగా సాగుతోంది. కీలక నేతలు, వందలాది మంది కార్యకర్తలతో రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతోంది. ఝలావార్‌లో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ.. భాజపా కార్యాలయం మీదుగా వెళ్లారు. ఆ సమయంలో కార్యాలయంపైన ఉన్న భాజపా కార్యకర్తలకు ఫ్లైయింగ్ కిస్సెస్ ఇచ్చారు రాహుల్ గాంధీ. వారిని చూస్తూ గాల్లో ముద్దులు పెట్టారు. రాహుల్ గాంధీ ముద్దుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.