Domestic Violence Case: హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్‌ చీఫ్‌, ఎంపీ ప్రతిభా సింగ్‌పై గృహ హింస కేసు నమోదైంది. ప్రతిభా సింగ్‌తో పాటు ఆమె కుమారుడు, ఎమ్మెల్యే విక్రమాదిత్య పేరు కూడా ఫిర్యాదులో ఉంది.


సమన్లు జారీ


అత్తింటివారు తనను వేధించారంటూ ఈ మేరకు విక్రమాదిత్య భార్య సుదర్శనా సింగ్ రాజస్థాన్‌ చుండావత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో విచారించేందుకు ప్రతిభా సింగ్‌, ఆమె కుమారుడికి ఉదయ్‌పుర్‌ పోలీసులు సమన్లు జారీ చేశారు.


విక్రమాదిత్య, సుదర్శనకు 2019 మార్చిలో వివాహమైంది. అయితే పెళ్లి అయిన కొన్ని నెలలకే అత్తింటివారు తనపై గృహహింసకు పాల్పడ్డారని.. మానసికంగా, శారీరకంగా వేధించారని సురద్శన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై నిఘా పెట్టేందుకు విక్రమాదిత్య గదిలో సీసీటీవీ కెమెరాలు పెట్టారని తెలిపారు.


గతేడాది తన మామ వీరభద్రసింగ్‌ మరణించాక, తనను ఉదయ్‌పుర్‌లోని పుట్టింటికి పంపించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక, తన భర్తకు చండీగఢ్‌కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కూడా ఉందని ఆరోపించారు. ఇక, విక్రమాదిత్య నుంచి తనకు భరణం ఇప్పించాలంటూ ఆమె మరో కేసు దాఖలు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఉదయ్‌పుర్‌ పోలీసులు.. ప్రతిభాసింగ్, ఆమె కుమారుడికి సమన్లు జారీ చేశారు.


కోర్టులో


ఈ సమన్లపై ఆమె భర్త, ఎమ్మెల్యే విక్రమాదిత్య స్పందించారు. గృహహింస కేసులో తమకు ఎటువంటి వారెంట్లు రాలేదన్నారు. ఇందులో తమ తప్పేమీ లేదని, అయితే ఇది పూర్తిగా తమ వ్యక్తిగత వ్యవహారమన్నారు. దీన్ని కోర్టులోనే తేల్చుకుంటామన్నారు. తాజా శాసనసభ ఎన్నికల్లో విక్రమాదిత్య శిమ్లా స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.


మండీ లోక్‌సభ స్థానం నుంచి ప్రతిభా సింగ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించిన తర్వాత.. ప్రతిభా సింగ్‌ సీఎం అవుతారని ప్రచారం జరిగింది.