How Hurricanes are Classified: ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణమండల తుపానులను (Tropical Cyclones) అవి ఏ సముద్ర ప్రాంతంలో ఏర్పడుతున్నాయనే దాని ఆధారంగా ఆ తుపానులను వేర్వేరు పేర్లతో పిలుస్తారు. తుపానులన్నీ ఒకే రకమైన వాతావరణ వ్యవస్థలో భాగం అయినప్పటికీ, వాటిని గుర్తించడానికి, హెచ్చరిక జారీ చేయడానికి వర్గీకరించారు.

Continues below advertisement


ప్రపంచవ్యాప్తంగా ఈ తుపానులకు ప్రధానంగా వాడుకలో ఉన్న పేర్లు ఇవే


1. సైక్లోన్ (Cyclone): హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న ప్రాంతాలలో (భారతదేశం, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా పశ్చిమ భాగం) వచ్చే తుపానులను సైక్లోన్‌గా పిలుస్తారు.


2. హరికేన్ (Hurricane): అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాలలో (అమెరికా, కరేబియన్) వచ్చే తుపానులను హరికేన్‌గా పిలుస్తారు.


3. టైఫూన్ (Typhoon): పశ్చిమ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాలైన (జపాన్, ఫిలిప్పీన్స్, చైనా) లలో వచ్చే తుపానులను టైఫూన్‌గా నామకరణం చేయడం జరిగింది.


ఇలా సముద్ర ప్రాంతాలను బట్టి తుపానులను సైక్లోన్, హరికేన్, టైఫూన్‌గా పిలవడం జరిగింది. అయితే, దీని వెనుక కూడా చారిత్రక మూలాలతో పాటు పలు అంశాలు ఇమిడి ఉన్నాయి.


హరికేన్ (Hurricane): ఈ పదాన్ని ఎక్కువగా అట్లాంటిక్ మహాసముద్రం, కరేబియన్ సముద్రం, ఈశాన్య పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో వాడతారు. దీని చారిత్రక మూలం పరిశీలిస్తే, "హరికేన్" అనే పదం కరేబియన్ ప్రాంతంలోని స్థానిక తెగైన టైన్యో (Taíno) ప్రజల నుంచి వచ్చింది. ఈ తెగ ప్రజలు తుపానులకు అధిపతిగా "జురాకాన్ (Juracán)" అని పిలుస్తూ దేవుడిగా ఆరాధిస్తారు. వీరితోపాటు మాయన్ అనే తెగ ప్రజల గాలి దేవుడి పేరు "హురాకాన్ (Huracan)" కూడా దీనికి మూలంగా భావిస్తారు. స్పెయిన్ అన్వేషకులు ఈ పదాలను కలిపి "హూరాకాన్ (Huracán)"గా పిలిచారు. ఈ పదం క్రమంగా ఆంగ్లంలో "హరికేన్‌"గా స్థిరపడింది.


టైఫూన్ (Typhoon): ఈ పదం వాయువ్య పసిఫిక్ మహాసముద్రం, చైనా సముద్రం ప్రాంతాల్లో వాడతారు. "టైఫూన్" అనే పదం గ్రీక, చైనీస్ పదాల కలయికతో ఏర్పడింది. గ్రీకు భాషలో "సుడిగాలి" లేదా "భయంకరమైన గాలి" అనే అర్థం వచ్చే "టైఫాన్ (Typhōn)" లేదా "టుఫోన్ (Typhōn)" అనే పదం నుంచి, చైనా భాషలో "గొప్ప గాలి" లేదా "పెద్ద గాలి" అనే అర్థం వచ్చే కాంటోనీస్ పదం "తాయ్ ఫంగ్ (tai fung)" అనే మాండరిన్ భాష నుంచి వచ్చి ఉండవచ్చని చెబుతారు. ఈ తుపానులను అప్పటి నావికులు ఇలా పిలవడం కారణంగా టైఫూన్ అని స్థిరపడింది.


ట్రాపికల్ సైక్లోన్ (Tropical Cyclone): ట్రాపికల్ సైక్లోన్ (ఉష్ణమండల తుఫాను) అనేది ఈ వ్యవస్థలన్నింటికీ సాధారణంగా ఉపయోగించే శాస్త్రీయ పదం. భూమధ్యరేఖకు దగ్గరగా ఉండే ఉష్ణమండల (Tropical) ప్రాంతంలోని వెచ్చని సముద్రాలపై ఇవి ఏర్పడతాయి కాబట్టి ఈ పేరు వచ్చింది.


ఇలా పేర్ల కేటాయింపు, ప్రాంతాలుగా విభజించడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. ఇలాంటి విభజన, పేర్లు పెట్టడం వంటి కార్యకలాపాలను ప్రపంచ వాతావరణ సంస్థ (World Meteorological Organization - WMO) పర్యవేక్షిస్తుంది.


ఈ విభజనకు ప్రధాన కారణాలు ఇవే:


తుపానుల గుర్తింపు సులభం: ఒకేసారి ఆయా ప్రాంతాల్లో తుపానులు ఏర్పడినప్పుడు వాటిని సులభంగా గుర్తించవచ్చు. ఎలాంటి గందరగోళం లేకుండా హెచ్చరికలను అందించడానికి ప్రాంతాల వారీగా పేర్లు అవసరం. తద్వారా తుపాను హెచ్చరికలను స్పష్టంగా ఆయా ప్రాంతాలకు అందజేసే అవకాశం ఉంటుంది.


పర్యవేక్షణ సులభం: ప్రాంతీయ తుపాను హెచ్చరికల కేంద్రాలు (Regional Warning Centers) ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సంస్థలు వేర్వేరు ప్రాంతాలను పర్యవేక్షిస్తాయి. హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో తుపానులను సైక్లోన్ అంటారు. ఈ ప్రాంతానికి భారతదేశంలోని IMD (భారత వాతావరణ శాఖ) హెచ్చరికలు జారీ చేస్తుంది. అట్లాంటిక్ సముద్ర పరిధిలో దీనిని హరికేన్ అంటారు. దీనికి US నేషనల్ హరికేన్ సెంటర్ (NHC) హెచ్చరికలు జారీ చేస్తుంది. వాయువ్య పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో తుపానును టైఫూన్ అంటారు. దీనికి జపాన్‌లోని RSMC టోక్యో హెచ్చరికలు జారీ చేస్తుంది.


ప్రజల్లో అవగాహన: ఇలా చారిత్రకమైన పేర్లను తుపానులకు పెట్టడం వల్ల ఆయా ప్రాంతాల ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. ఈ పేర్లు ఒకప్పటి నావికులు వాడిన కారణంగా అక్కడి ప్రజల్లోకి చొచ్చుకెళ్తుంది.


ఇలా ప్రాంతీయ కేంద్రాలు, వాటి పరిధి, తుపానులకు పేర్లు పెట్టడం వంటి పర్యవేక్షణ కార్యకలాపాల కోసం ప్రపంచాన్ని ఆరు ప్రధాన బేసిన్‌లుగా విభజించడం జరిగింది. ప్రతి బేసిన్‌కు ఆర్.ఎస్.ఎం.సి (RSMC) అంటే ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రం (Regional Specialized Meteorological Centre) ఉంటుంది. ఆయా కేంద్రాలు తమ పరిధిలోని దేశాల జాబితాల నుంచి పేర్లను ఎంపిక చేస్తాయి. సైక్లోన్ వస్తే ఉత్తర హిందూ మహా సముద్రం, బంగాళా ఖాతం, అరేబియా సముద్ర ప్రాంతాలకు తుపానుకు పేరు పెట్టడానికి ఆర్.ఎస్.ఎం.సి న్యూఢిల్లీ సమన్వయం చేస్తుంది. హరికేన్ ఏర్పడితే, వాటికి పేర్లు పెట్టడానికి, హెచ్చరికలు జారీ చేయడానికి ఉత్తర అట్లాంటిక్, తూర్పు ఉత్తర పసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో హరికేన్ వస్తే, నేషనల్ హరికేన్ సెంటర్ (NHC), మయామి, USA తమ రీజియన్‌లో ఉన్న దేశాలతో సమన్వయం చేస్తుంది. అదే రీతిలో టైఫూన్స్ విషయానికి వస్తే, వాయువ్య పసిఫిక్ ప్రాంతంలో తుపానులు వస్తే, ఆర్.ఎస్.ఎం.సి టోక్యో (జపాన్) బాధ్యతలు చేపడుతుంది. నైరుతి హిందూ మహాసముద్రంలో సైక్లోన్ వస్తే, RSMC, రియూనియన్ (ఫ్రాన్స్) హెచ్చరికలు చేయడం, ఆ తుపానులకు పేరు పెట్టే బాధ్యతలను సమన్వయపరుస్తుంది.


ప్రస్తుతం మన న్యూ ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న ఆర్.ఎస్.ఎం.సిలో 13 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇందులో భారతదేశం, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), యెమెన్ దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. ప్రస్తుతం మోంథా తుపాను పేరును ఈ కేంద్రంలో భాగమైన థాయ్‌లాండ్ దేశం సూచించింది. మోంథా అంటే థాయ్ భాషలో సువాసన గల పువ్వు లేదా అందమైన పువ్వు అని అర్థం.