TamilNadu Cabinet Controversy:  తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్  కొత్త రాజకీయ వివాదంలో చిక్కుకున్నారు. అధికారిక హోదా లేని ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు ఏకంగా రాష్ట్ర క్యాబినెట్  సమావేశాలకు, ఉన్నత స్థాయి సమీక్షలకు హాజరవుతున్నారంటూ ప్రధాన ప్రతిపక్షం ద్రవిడ మున్నేట్ర కజగం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్‌ఎస్ భారతి, తమిళనాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్   కి అధికారికంగా ఒక లిఖితపూర్వక ఫిర్యాదును సమర్పించారు. ముఖ్యమంత్రి విజయ్‌తో పాటు సదరు ప్రైవేట్ వ్యక్తులపై తక్షణమే ఎఫ్ఐఆర్  నమోదు చేసి, సమగ్ర క్రిమినల్ విచారణ జరపాలని ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే డిమాండ్ చేసింది.

Continues below advertisement

ఆ ఇద్దరు ఎవరు? సెక్రటేరియట్‌లో ఆఫీస్ రూమ్‌లు కూడా!

డీఎంకే తన ఫిర్యాదులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాన్ అరోకియాసామి , విష్ణు రెడ్డి  అనే ఇద్దరు వ్యక్తుల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ముఖ్యమంత్రి విజయ్‌కు అత్యంత సన్నిహితులుగా చెప్పుకుంటున్న వీరు.. సచివాలయంలో   జరిగే అత్యంత రహస్యమైన క్యాబినెట్ సమావేశాలకు, ఉన్నత స్థాయి ప్రభుత్వ నిర్ణయాత్మక చర్చలకు ఎలాంటి చట్టబద్ధమైన నియామకం లేదా అనుమతి లేకుండానే క్రమంతప్పకుండా హాజరవుతున్నారని డీఎంకే ఆరోపించింది. అంతేకాదు, వీరికి సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం  పక్కనే ప్రత్యేకంగా ఆఫీస్ ఛాంబర్లను కూడా కేటాయించారని డీఎంకే తన ఫిర్యాదులో పొందుపరిచింది.

Continues below advertisement

అధికారులకు ఆదేశాలు.. సమాంతర పాలనపై తీవ్ర ఆగ్రహం!

ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక హోదా లేని ఈ ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు.. సెక్రటేరియట్ లోపల కూర్చుని ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారులకు నేరుగా ఆదేశాలు జారీ చేస్తున్నారని, ప్రభుత్వ విధానాలను  ప్రభావితం చేస్తున్నారని ఆర్‌ఎస్ భారతి ఆరోపించారు. ఎగ్జిక్యూటివ్ డెసిషన్ మేకింగ్‌లో వీరు చట్టవిరుద్ధంగా  డీ ఫాక్టో అధికారాలను చలాయిస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంలో ఇలాంటి సమాంతర శక్తులు జోక్యం చేసుకోవడం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని డీఎంకే మండిపడింది.

 రహస్య ప్రమాణ స్వీకారం  ఉల్లంఘన.. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద కేసు!

రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(3) ప్రకారం ముఖ్యమంత్రిగా పదవిని స్వీకరించిన విజయ్.. ప్రభుత్వ అధికారిక రహస్యాలను కాపాడతామని  గోప్యతా ప్రమాణం చేశారని డీఎంకే గుర్తుచేసింది. క్యాబెట్ నోట్లు, క్లాసిఫైడ్ రికార్డులు చర్చకు వచ్చే సమావేశాల్లో ప్రైవేట్ వ్యక్తులను కూర్చోబెట్టడం ద్వారా సీఎం తన ప్రమాణాన్ని ఉల్లంఘించారని ఆరోపించింది. ఈ చర్య 1923 నాటి ‘అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్’   ప్రకారం నేరమని, అలాగే భారతీయ న్యాయ సంహిత (BNS 2023) కింద క్రిమినల్ లీకేజీ, ప్రభుత్వ కార్యాలయ దుర్వినియోగం, నేరపూరిత కుట్ర కిందికి వస్తుందని స్పష్టం చేస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.

 తమిళనాడు రాజకీయాల్లో ముదురుతున్న కోల్డ్ వార్!

విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి ద్విముఖ పోరాటం చేస్తున్న డీఎంకే.. ఈ సంచలన ఆరోపణల ద్వారా దళపతి విజయ్‌ను గట్టిగా ఇరుకున పెట్టాలని చూస్తోంది. ఒకవేళ డీజీపీ ఈ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణకు ఆదేశిస్తే, ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మరి తన ఇద్దరు అత్యంత ఆప్తులైన సలహాదారులపై వచ్చిన ఈ  అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్  లీకేజీ వివాదంపై సీఎం విజయ్ ఎలా స్పందిస్తారో, దీనిని రాజకీయంగా ఎలా తిప్పికొడతారో వేచి చూడాలి. ఈ వివాదం రాబోయే రోజుల్లో తమిళనాట డీఎంకే వర్సెస్ టీవీకేల మధ్య మరింత అగ్గి రాజేయడం ఖాయంగా కనిపిస్తోంది.