CM Yogi Adityanath:
క్లారిటీ ఇచ్చిన యోగి..
ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2014 నుంచి ఏటా ఆ ఇమేజ్ పెరుగుతూనే వస్తోంది. అంతర్జాతీయంగానూ గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అని బీజేపీ అంత కాన్ఫిడెంట్‌గా చెబుతోందంటే అందుకు కారణం ప్రధాని మోదీయే. ఇప్పట్లో ఆయన ఇమేజ్‌కు వచ్చే ఇబ్బందేమీ లేదంటున్నాయి కొన్ని సర్వేలు. అయితే...ఎప్పుడో అప్పుడు ఆయన ఆ పదవి నుంచి తప్పుకోక తప్పదు. పైగా బీజేపీ రాజ్యాంగం ప్రకారం 75 ఏళ్లు దాటిన వాళ్లు పార్టీలో ఏ పదవిలో ఉండకూడదు. అదే పరిస్థితి వచ్చి మోదీ ప్రధాని పదవి నుంచి దిగిపోతే...తదుపరి ఆ బాధ్యతలు తీసుకునేదెవరు..? అనే ఆసక్తికరమైన చర్చ ఎప్పటి నుంచో నడుస్తోంది. అయితే...ఈ ప్రశ్న ఎన్ని సార్లు వినబడిందో..అన్ని సార్లు వినబడిన పేరు యోగి ఆదిత్యనాథ్. ప్రస్తుతం యూపీ సీఎంగా ఉన్న ఆయనకూ మంచి పేరే ఉంది. యూపీలోని రౌడీయిజాన్ని చాలా వరకు తగ్గించగలిగారన్న సానుకూల అభిప్రాయం ఉంది. బీజేపీలో మోదీ తరవాత చరిష్మా ఉన్న నేత యోగి ఆదిత్యనాథ్. అందుకే...మోదీ స్థానంలో ఆయనను మాత్రమే ఊహించగలం అని బీజేపీ శ్రేణులు పరోక్షంగా చెబుతున్నాయి. అయితే...ఇప్పటి వరకూ యోగి దీనిపై ఎప్పుడూ స్పందించలేదు. అసలు ఆ సందర్భం రాలేదు కూడా. కానీ ABP News నిర్వహించిన ప్రత్యేక చర్చలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్..ఈ ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చారు.
ప్రధాని అవుతారని భావిస్తున్నారా అని అడగ్గా...దానిపై వివరణ ఇచ్చారు.
"నాకు ఇలా యోగిలా ఉండటమే ఇష్టం. నేను ముందు యోగిని. ఆ తరవాతే రాజకీయ నాయకుడిని. కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తారా..? రాష్ట్ర రాజకీయాల్లో ఉంటారా అని ప్రశ్నిస్తే..నా అవసరం ఎక్కడుంటే అక్కడే ఉంటానని బదులిస్తాను. నేను 30 ఏళ్ల క్రితమే సన్యాసం తీసుకున్నాను. రాజకీయాలు నా వృత్తి కాదు. నేనెప్పుడూ అలా మాట్లాడనూ లేదు. రాజకీయాలే సర్వస్వం అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఓ యోగి మార్గదర్శిగా నిలవాలి. అందుకే నేనీ సవాలుని తీసుకున్నా. నేను ప్రధాని అవుతానని ఎప్పుడూ చెప్పలేదు. నాకు ఇలా యోగిలా ఉండటమే ఇష్టం"
- యోగి ఆదిత్యనాథ్, యూపీ సీఎం
రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు సంతోషంగా ఫీల్ అయ్యారా అని ప్రశ్నించగా...తాను సన్యాసిగా మారినప్పుడే చాలా సంతోషపడ్డానని చెప్పారు. అప్పటి నుంచి బాధ, సంతోషం అనే భావోద్వేగాలను అదుపులో పెట్టుకుంటున్నానని వివరించారు.
బెస్ట్ సీఎం..
దేశంలో 30 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవరు బెస్ట్..? అని ఓ సర్వే చేపట్టగా...ఇందులో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. తన పని తీరుతో, సంచలన నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఆయన...ఉత్తమ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. సీఓటర్, ఇండియా టుడే చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మూడ్ ఆఫ్ ది కంట్రీ పేరుతో చేసిన ఈ సర్వేలో బెస్ట్ సీఎం ఎవరు అని ప్రశ్నించగా...ఎక్కువ మంది యోగి ఆదిత్యనాథ్ పేరు చెప్పారట. సర్వే ప్రకారం మొత్తం 39.1% మంది ప్రజలు బెస్ట్ సీఎం క్యాటగిరీలో "యోగి ఆదిత్య నాథ్"కే ఓటు వేశారు. యోగి తరవాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. 16% మంది కేజ్రీవాల్‌కు ఓటు వేశారు. ఇక మూడో బెస్ట్ సీఎంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 7.3% మంది ఓటు వేశారు. యోగి పాపులారిటీ బాగా పెరిగినట్టు సర్వేలో తేలింది. ఇదే సమయంలో గతేడాది ఆగస్టుతో పోల్చి చూస్తే...కేజ్రీవాల్ పాపులారిటీ 6% మేర తగ్గింది.
Also Read: UK Sales Director: బట్టతల ఉందని ఉద్యోగంలో నుంచి తీసేసిన కంపెనీ, రివెంజ్ తీర్చుకున్న ఎంప్లాయ్