టేకాఫ్ ముందే జాగ్రత్తపడాలి: డీజీసీఏ


వరుస ప్రమాదాలకు గురవుతున్న స్పైస్‌జెట్‌కు డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్-DGCA షోకాజ్ నోటీసులు ఇచ్చింది. జులై 5వ తేదీనే దాదాపు మూడు చోట్ల ప్రమాదాలకు గురైంది స్పైస్‌జెట్ ఫ్లైట్. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ స్పందించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి జరిగిన ఘటనలపై రివ్యూ చేసింది. భద్రతా లోపాలు, నిర్వహణలో నిర్లక్ష్యం లాంటి కారణాలు కనిపిస్తున్నాయంటూ మండిపడింది. ఈ సంస్థ "చాలా జాగ్రత్తగా" ఉండాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. టేకాఫ్ అయ్యే ముందే ఒకటికి రెండు సార్లు ఫ్లైట్‌ను చెక్ చేయాలని ఆదేశించింది. "చూడటానికి ఇవి చాలా చిన్న ప్రమాదాలుగానే కనిపిస్తుండొచ్చు. కానీ తరచుగా జరుగుతుండటం వల్లే మేము కచ్చితంగా దృష్టి సారించాల్సి వచ్చింది. అంతర్గత వ్యవస్థలో ఏమైనా లోపాలుంటే వాటిని సరిదిద్దాల్సిన అవసరముంది" అని తేల్చి చెప్పింది. 


ఆర్థిక నష్టాలతో సతమతం..


స్పైస్‌జెట్ ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాల గురించీ DGCA ప్రస్తావించింది. స్పేర్‌ పార్ట్స్‌ కూడా కొనలేని స్థితిలో ఉందని, వెండార్లకు కూడా సరైన సమయంలో డబ్బులు చెల్లించలేకపోతోందని వెల్లడించింది. గతేడాది డిసెంబర్‌కు ముందు 9 నెలల్లోనూ స్పైస్‌జెట్ సంస్థ దాదాపు రూ.1,259 కోట్ల నష్టాలు చవి చూసింది. ప్రస్తుతం ఆ సంస్థ ఎంత నష్టాల్లో ఉందన్నది ఇంకా తెలియాల్సి ఉంది. స్పైస్‌జెట్‌ ఇలా తరచు ప్రమాదాలకు గురవుతూనే ఉంది. ఇటీవలే దిల్లీ నుంచి జబల్‌పూర్ వెళ్లే స్పైస్‌జెట్ విమానాన్ని దిల్లీలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 5 వేల అడుగుల ఎత్తులో ఉండగా ఉన్నట్టుండి విమానంలో పొగలు వచ్చాయి. ఇది గమనించిన సిబ్బంది వెంటనే దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. SG-2862స్పైస్‌జెట్ ఫ్లైట్ దిల్లీలో ఉదయం 6.15 నిముషాలకు బయల్దేరింది. టెక్నికల్ సమస్య కారణంగా మళ్లీ 7 గంటల వరకే దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు రిటర్న్ అయింది. క్యాబిన్ నుంచి పొగలు రావటాన్ని సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తం అవటం వల్ల ఎలాంటి ప్రమాదమూ జరగలేదని స్పైస్‌జెట్‌ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. 


స్పైస్‌జెట్‌లో వరుస ప్రమాదాలు.. 


ఇప్పుడే కాదు. గతంలోనూ ఇదే విధంగా స్పైస్‌జెట్ విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది. పాట్నా నుంచి దిల్లీ వెళ్తున్న విమానాన్ని ఉన్నట్టుండి అత్యవసర ల్యాండింగ్ చేశారు. పట్నాలోని బిహ్‌తా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద అత్యవసరంగా ల్యాండ్ అయింది. దిల్లీ వెళ్లాల్సిన స్పైస్ జెట్ ఫ్లైట్ పట్నాలో 12.10 గంటలకు టేకాఫ్ అయింది. అయితే గాల్లోకి వెళ్లిన కొద్ది సేపటికే ఎడమ వైపు రెక్కకి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఇది పైలట్ గమనించలేదు. పుల్వరి షరీఫ్ ప్రాంత ప్రజలు చూసి వెంటనే ఎయిర్‌పోర్ట్ అధికారులకు కాల్ చేశారు. అప్పటికే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌లు ఆన్ కావటం వల్ల పైలట్ అప్రమత్తమయ్యాడు. అప్పటికప్పుడు మళ్లీ విమానాన్ని వెనక్కి మళ్లించి ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు.