Devulapalli Subbaraya Sastri Dies In Chennai: ప్రముఖ చిత్రకారుడు, రచయిత దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి కన్నుమూశారు. సుబ్బరాయశాస్త్రి గురువారం రాత్రి తమిళనాడు రాజధాని చెన్నైలో తుదిశ్వాస విడిచారని సమాచారం. అద్భుతమైన కార్టూన్లు, కథలతో చిన్నారులతో పాటు పెద్దలను సైతం అలరించిన సుబ్బరాయశాస్త్రి కలం పేరు బుజ్జాయి. కార్టూనిస్టుగా, చిన్న పిల్లల కథా రచయితగా ఆయన చాలా ఫేమస్. ముఖ్యంగా ఆయన క్రియేట్ చేసిన డుంబు పాత్ర సుబ్బరాయశాస్త్రికి చాలా పేరు తెచ్చింది.
ప్రముఖ కవి, సినీ గేయరచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాజహంస దంపతులకు సెప్టెంబరు 11 1931 లో దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి జన్మించారు. మిగతావారిలా స్కూలుకు వెళ్లకపోయినా ఆయన తనకంటూ ఓ ప్రత్యేక పేరును సంపాదించుకున్నారు. చిన్నతనంలో తండ్రి కృష్ణశాస్త్రి వెన్నంటే ఉండేవారు. దాంతో ఆ కాలం నాటి గొప్ప వ్యక్తులందరికి సన్నిహితంగా మెలిగే అవకాశం కలగడంతో ఎన్నో విషయాలు నేర్చుకునేవారు. ప్రముఖ కవి, రచయిత శ్రీశ్రీ ఓ సభలో బోరు కొడుతుందని సుబ్బరాయశాస్త్రిని షికారుకు తీసుకెళ్లి ఆడించారు. ఇలా ప్రముఖులతో చిన్ననాటి నుంచి కొత్త విషయాలు, జీవితాన్ని నేర్చుకున్నారు. వాటిని బొమ్మల రూపంలో, చిన్న పిల్లల కథల రూపంలో మన ముందుకు తీసుకొచ్చి విజయం సాధించిన వారిలో ఈయన ఒకరు.
దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి 17 ఏళ్ల వయసులో బుజ్జాయి ‘బానిస పిల్ల’ అనే బొమ్మల పుస్తకం ప్రచురించి 'కామిక్ స్ట్రిప్' పుస్తకాలకు దేశంలోనే ఆద్యుడిగా పేరుపొందారు. బాపు రమణల బుడుగు లాంటి క్యారెక్టర్ డుంబు సృష్టికర్తగా నిలిచారు. చిన్నారులు ఎంతగానో ఇష్టపడే పంచతంత్ర కథలకు ఎంతో అందమైన బొమ్మలు వేసి ఇలస్ట్రేటెడ్ వీక్లీలో 1963 నుంచి 68 వరకూ సీరియల్ గా ప్రచురించారు. ఈ ఇంగ్లీష్ కామిక్స్ 5 పుస్తకాలుగా వచ్చాయి. మిత్రలాభం, మిత్రభేదం పుస్తకాలుగా ఇవి తెలుగులోనూ అందుబాటులో ఉన్నాయి. ఆయన భైరవ్, పెత్తందార్, డుంబు కామిక్ స్ట్రిప్పులను చేశారు.
దేవులపల్లి సుబ్బరాయశాస్త్రికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. తన కుమారునికి తండ్రి పేరు దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి పేరు పెట్టారు. సుబ్బరాయశాస్త్రి కుమారుడు కూడా రచయిత. ఓ కుమార్తె రేఖా సుప్రియ, బుజ్జాయి రెండవ కుమార్తె లలిత రామ్ కూడా రచయిత్రి అయ్యారు.
గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం కథానికను బొమ్మలద్వారా పాఠకులకు పరిచయం చేశారు. ‘న్యాయానికి భయం లేదు’ అనే బొమ్మల ధారావాహిక 1975లో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైంది. ప్రముఖులతో తాను నేర్చుకున్న విషయాలు, అనుభవాలను ‘నాన్న-నేను’ అనే స్వీయచరిత్ర పుస్తకాన్ని రాశారు. ‘నవ్వులబండి - డుంబు బొమ్మల కథలు’ అనే పుస్తకాన్నిరాసి చిన్నారులకు వినోదాన్ని పంచారు.
Also Read: Horoscope Today 28 January 2022: ఈ మూడు రాశులవారు అప్రమత్తంగా ఉండాలి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Also Read: Weather Updates: ఏపీలో మరో రెండు రోజులు వర్షాలే.. తెలంగాణలో పెరుగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు