తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవేనేని ఉమా మహేశ్వరరావు రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలయ్యారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా న్యాయదేవత అనుగ్రహంతో విడుదలయ్యానని.. అక్రమాలపై ప్రభుత్వంపై పోరాటం ఆగబోదని ప్రకటించారు. హైకోర్టు బుధవారమే బెయిల్ మంజూరు చేసినా పత్రాలు అందకపోవడంతో విడుదల ఆలస్యం అయింది. ఈ రోజు పత్రాలు అన్నీ జైలు అధికారులకు అందించారు. ఆయన విడుదలయ్యారు. 


జూలై 27వ తేదీన  కొండపల్లి రక్షిత అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని..  పరిశీలించడానికి వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో  వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు తమపై రాళ్ల దాడి చేశారని నిరసనగా ఆయన కారులోనే పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అర్థరాత్రి వరకూ ఆయన కారులోనే నిరసన తెలిపారు. తర్వాతి రోజు తెల్లవారుజామున కారు అద్దాలు తొలగించి.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే దేవినేని ఉమనే తమపై దాడి చేశారని వైసీపీ కార్యకర్తలు కూడా పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టారు. ఈ కారణంగా పోలీసులు దేవినేని ఉమపై  హత్యాయత్నంతో పాటు , అట్రాసిటీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు సెక్షన్లు నాన్ బెయిలబుల్ కావడంతో రిమాండ్‌కు తరలించారు. 


మైలవరం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే కొండపల్లి అడవుల్లో కొంత కాలం నుంచి అక్రమ మైనింగ్ జరుగుతోంది. పెద్ద ఎత్తున గ్రావెల్ తరలించారు. గతంలో అటవీ అధికారులు దాడులు చేసి.. మైనింగ్ చేస్తున్నట్లుగా గుర్తించారు. కానీ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. అక్రమ మైనింగ్‌ నిజమేనని ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ కూడా నివేదిక ఇచ్చింది. కానీ కమిటీనే తప్పుడు నివేదిక ఇచ్చిందని ప్రభుత్వం వారిపై చర్యలకు సిఫార్సు చేసింది. దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది. దేవినేని ఉమను అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో వేశారని టీడీపీ అధినేత చంద్రబాబు సహా విపక్ష నేతలందరూ ఖండించారు. దేవినేని ఉమ కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. 


దేవినేని ఉమను జైల్లో ఉంచిన సమయంలో అక్కడి జైలు సూపరింటెండెంట్‌ను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. దేవినేని ఉమకు హాని కల్పించడానికే ఇలా చేశారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపణలు చేశారు. గవర్నర్, కేంద్ర హోంమంత్రి, హైకోర్టు చీఫ్ జస్టిస్‌లకు దేవినేని ఉమ భార్య లేఖలు రాశారు. రక్షణ కల్పించాలని కోరారు. ఈ మధ్యలో పోలీసులు దేవినేని ఉమను కస్టడీకి ఇవ్వాలని మచిలీపట్నం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.దీంతో ఆయన విడుదలయ్యారు.