Delimitation Bill Fails:    కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన మహిళా రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో ఓటమి పాలైంది. అయితే, ఈ ఓటమి వెనుక ఒక లోతైన రాజకీయ వ్యూహం ఉందన్న చర్చ ఇప్పుడు పార్లమెంట్ వర్గాల్లో మొదలైంది. మూడు బిల్లులను ఒకేసారి ప్రవేశపెట్టిన ప్రభుత్వం, కేవలం రాజ్యాంగ సవరణను మాత్రమే ఓటింగ్‌కు ఉంచి, మిగిలిన డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను అర్థాంతరంగా వెనక్కి తీసుకోవడం ఈ వ్యూహంలో భాగమేనని  భావిస్తున్నారు.

Continues below advertisement

పునాది లేనిచోట భవనం సాధ్యం కాదనే సాంకేతిక కారణం                             

మహిళా రిజర్వేషన్లకు పునర్విభజన  ప్రాతిపదిక కావాలని ప్రభుత్వం ఈ బిల్లుల్లో పొందుపరిచింది. అయితే, వీటన్నిటికీ మౌలికమైన రాజ్యాంగ సవరణ సభ్యుల ఆమోదం పొందలేకపోయింది. చట్టసభలో మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించలేక ఈ బిల్లు వీగిపోవడంతో, దానికి అనుబంధంగా ఉన్న మిగిలిన రెండు బిల్లులకు చట్టబద్ధత ఉండదు. పునాది లాంటి రాజ్యాంగ సవరణే లేనప్పుడు, దానిపై నిర్మించిన మిగిలిన చట్టాలను ఆమోదించుకున్నా ప్రయోజనం లేదన్న ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని ఉపసంహరించుకుంది.

Continues below advertisement

 విపక్షాలపై మహిళా వ్యతిరేక ముద్ర వేసే ఎత్తుగడ 

కేవలం మహిళా బిల్లును మాత్రమే ఓటింగ్‌కు ఉంచడం ద్వారా ప్రభుత్వం ఒక రాజకీయ అస్త్రాన్ని సిద్ధం చేసుకుంది. డీలిమిటేషన్ బిల్లుపై ఓటింగ్ జరిగి ఉంటే చర్చ  దక్షిణాది రాష్ట్రాల హక్కుల దిశగా మళ్లేది. అలా కాకుండా, కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లును మాత్రమే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయనే  అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా, రాబోయే ఎన్నికల్లో విపక్ష కూటమిని  మహిళా వ్యతిరేక  శక్తులుగా చిత్రీకరించేందుకు  అధికార పక్షానికి ఒక బలమైన కారణం దొరికింది.

 దక్షిణాది ఆగ్రహం.. సమాఖ్య స్ఫూర్తిపై రాజీ 

జనాభా నియంత్రణ పాటించినందుకు తమకు లోక్‌సభ సీట్ల సంఖ్యలో కోత పడుతుందన్న దక్షిణాది రాష్ట్రాల ఆందోళన ఈ బిల్లుల వీగిపోవడానికి ప్రధాన కారణమైంది. డీలిమిటేషన్ బిల్లును బలవంతంగా ముందుకు తీసుకెళ్తే దేశంలో ప్రాంతీయ విభేదాలు పెచ్చరిల్లే ప్రమాదం ఉందని కేంద్రం గుర్తించింది. ఈ సున్నితమైన అంశంపై మరింత వివాదం పెంచి రాజకీయంగా నష్టపోవడం కంటే, ప్రస్తుతానికి ఆ బిల్లులను వెనక్కి తీసుకుని రాష్ట్రాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించడమే మేలని కేంద్రం భావించినట్లు కనిపిస్తోంది.

 పాత చట్టమే ప్రత్యామ్నాయం.. గందరగోళానికి చెక్  రాజ్యాంగ సవరణ విఫలమైనప్పటికీ, 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ చట్టం ఇప్పటికే గెజిట్‌లో ఉంది. కొత్త సవరణలు చెల్లుబాటు కాకపోవడంతో, ప్రభుత్వం ఇప్పుడు ఆ పాత చట్టం ప్రకారమే ముందుకు వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకుంది. డీలిమిటేషన్‌తో ముడిపెట్టి తెచ్చిన కొత్త చిక్కుముడులను తొలగించుకుని, వివాదరహితంగా మహిళా రిజర్వేషన్లను అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం తన తదుపరి అడుగులు వేస్తోంది. దీనివల్ల అటు మహిళా సాధికారత క్రెడిట్ కాపాడుకుంటూనే, ఇటు రాజకీయ సంక్షోభం నుండి గట్టెక్కవచ్చని అధికార పక్షం అంచనా వేస్తోంది.