Electric Vehicle Buying Tips: భారత్ మార్కెట్‌లో ఈవీల జోరు ఊపందుకుంటోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. అదే టైంలో మంచి ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ వాహనలు వస్తున్నాయి. అందుకే చాలా మంది  ఈవీలు కొనేందుకు ముందుకొస్తున్నారు. ఈ రోజుల్లో కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈవీల విషయంలో  అది లాభదాయకమా కాదా అని నిశితంగా గమనిస్తున్నారు. ఈవీలను భవిష్యత్‌ వాహనాలుగా పరిగణిస్తున్నప్పటికీ, ఒకదాన్ని కొనుగోలు చేసే ముందు వాటి వల్ల కలిగే లాభనష్టాల గురించి సమగ్రంగా తెలుసుకోవడం చాలా కీలకం. సరైన సమాచారం మాత్రమే మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది. 

Continues below advertisement

ఈవీల వల్ల కలిగే ప్రయోజనాలు 

ఎలక్ట్రిక్‌ వాహనాల వల్ల కలిగే అతి పెద్ద ప్రయోజనం వాటి తక్కువ నిర్వహణ ఖర్చులు. పెట్రోల్ లేదా డీజిల్ వాహనానికి కిలోమీటర్‌కు ఐదు నుంచి పది రూపాయు ఖర్చు అవుతుంది. ఒక ఈవీకి సుమారు రెండు నుంచి మూడు రూపాయలు ఖర్చు అవుతుంది. బైక్‌లు, స్కూటర్ల ధర ఇంకా తక్కువ, దీని వల్ల నెలవారీ ఖర్చు ఆదా అవుతుంది. ఈవీలు ఇంజిన్‌కు బదులుగా బ్యాటరీ, మోటారును ఉపయోగిస్తాయి. దీని వల్ల కదిలే భాగాలు తక్కువగా ఉంటాయి. ఫలితంగా నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా, ఈవీలను నడపడం సులభం, అవి అతి తక్కువ శబ్ధాన్ని చేస్తాయి. దీని వల్ల డ్రైవింగ్ సౌకర్యవంతంగా ఉంటుంది. 

ప్రతికూల అంశాలు ఉన్నాయి!

ఈవీలను విస్మరించలేని కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. మొదటిది, వాటి ధర విషయానికి వస్తే, పెట్రోల్ లేదా సీఎన్జీ వాహనాల కంటే ఎలక్ట్రిక్‌ వాహనాలు ఖరీదైనవి. ఒక సాధారణ కారును 7-8 లక్షలకు కొనుగోలు చేయగా, అదే తరా ఈవీకి 10-12 లక్షల వరకు ఖర్చవుతుంది. బ్యాటరీకి సంబంధించిన విషయంలో చాలా ఆందోళన ఉంది. ఒక వేళ బ్యాటరీ పాడైపోతే, దానిని మార్చడానికి ఎంత ఖర్చు అవుతుందోనని ప్రజలు ఆలోచిస్తున్నారు. కంపెనీలు ఇప్పుడు బ్యాటరీలపై ఎక్కువ కాలం వారంటీలను అందిస్తున్నప్పటీకీ, ఈ ఆందోళన ఇప్పటికీ కొనసాగుతోంది. అంతేకాకుండా సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందనందున, ఈవీల రీసేల్‌ విలువపై స్పష్టత లేదు. 

Continues below advertisement

ఛార్జింగ్‌ సమస్య ఇప్పటికీ ఒక పెద్ద సవాల్

ఈవీలతో అతి పెద్ద సమస్య ఛార్జింగ్‌ స్టేషన్లు, ప్రయాణంలో బ్యాటరీ అయిపోతే, ఛార్జింగ్ స్టేషన్‌ను కనుగొనడం కష్టమవుతుంది. పెట్రోల్ పంపుల మాదిరిగా కాకుండా, ఛార్జింగ్‌ స్టేషన‌లు అన్ని చోట్లా అందుబాటులో ఉండవు. సుదూర ప్రయాణాలు చేసే వారికి ఇది ఒక పెద్ద సమస్య కావచ్చు. అంతేకాకుండా బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి సమయం పడుతుంది. దీని వల్ల ప్రజలు వేచి ఉండాల్సి వస్తోంది. 

ప్రభుత్వం, కంపెనీలు ఏం చేస్తున్నాయి?

ఈవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఎక్కువ మందిని వాటిని కొనుగోలు చేసేలా ప్రోత్సహించడానికి సబ్సిడీలు, పన్ను రాయితీలు వంటివి ఇందులో ఉన్నాయి. అదనంగా  కంపెనీలు కొత్త, సరసమైన ఈవీలను పరిచయం చేస్తూ, ఛార్జింగ్‌ నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. 

ఈవీ ఎలాంటి వాళ్లకు ఉపయోగం 

మీరు రోజూ 30 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్లు ప్రయాణిస్తే, ఈవీ ఒక మంచి ఆప్షన్ కావచ్చు. కొన్ని సంవత్సరాల్లో మీరు  అదనపు ఖర్చును తిరిగి రాబట్టుకునే అవకాశం ఉంది. ఇంట్లో ఛార్జింగ్ సౌకర్యాలు ఉన్న వారికి ఈవీలు చాలా అనుకూలంగా ఉంటాయి. అయితే తరచుగా ఎక్కువ దూరం ప్రయాణించే వారికి, పెట్రోల్ లేదా డీజిల్‌ వాహనం ఒక మంచి ఎంపిక కావచ్చు.