IT Jobs 2026: దశాబ్దాల కాలంగా ఇంజినీరింగ్ విద్యార్థులకు ఐటీ రంగం ఒక బంగారు బాతులా కనిపించేది. కాలేజీ చివరి సంవత్సరంలో ఉండగానే వేలాది మందిని బల్క్‌గా కంపెనీలు తీసుకెళ్లి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాల్లో చేర్చుకునేవి. కానీ ఇప్పుడు ఆ మాస్‌ హైరింగ్‌ శకం ముగిసిందని విప్రో తీసుకున్న నిర్ణయం స్పష్టం చేస్తోంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏలుతున్న వేళ ఐటీ కంపెనీలు మనుషుల సంఖ్య కంటే మెషిన్ల సామర్థ్యానికే పెద్ద పీట వేస్తున్నాయి. 

Continues below advertisement

క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు విప్రో బైబై

భారత్ ఐటీ దిగ్గజం విప్రో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాన ఎలాంటి ఫ్రెషర్ క్యాంపస్ హైరింగ్ చేయడం లేదని ప్రకటించింది. ఈ నిర్ణయం ఐటీ నిపుణులను, విద్యార్థులను ఆశ్చర్యానికి గురిచేసింది. 

విప్రో చీఫ్ హ్యూమన్ ఆఫిసర్ సౌరభ్ గోవిల్ మాట్లాడుతూ... ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు చాలా అస్థిరంగా ఉన్నాయి. మునుపటిలా రెవెన్యూ పెరగాలంటే వేలాది మంది కొత్త ఉద్యోగులు అవసరం లేదు. ఏఐ సాయంతో తక్కువ మందితోనే ఎక్కువ పనిని పూర్తి చేయవచ్చని కంపెనీ భావిస్తోంది. FY 26లో విప్రో కేవలం 7500 మంది ఫ్రెషర్లను మాత్రమే నియమించుకుంది. ఇది గతంలో పోలిస్తే చాలా తక్కువ. 

Continues below advertisement

మొత్తం ఐటీ పరిశ్రమ ఏమంటోంది?

విప్రో తీసుకున్నది ఒక్క కంపెనీ నిర్ణయం మాత్రమే కాదు. ఇది భారత ఐటీ రంగం మొత్తం  అనుసరిస్తున్న కొత్త వ్యూహానికి సంకేతం. టీసీఎస్‌ కూడా గతంలో కంటే నియామకాలను నియంత్రించింది. ఇప్పటికే 25వేల క్యాంపస్ ఆఫర్లు ఇచ్చినా, డిమాండ్‌ను బట్టే తదుపరి అడుగులు వేస్తామని చెబుతోంది. ఏఐ, క్లౌడ్‌, సైబర్ సెక్యూరిటీ వంటి ప్రత్యేక విభాగాలలో మాత్రమే ఇన్ఫోసిస్‌ హైరింగ్ చేస్తోంది. ఐబీఎం సుమారు 7,800 బ్యాక్‌ ఆఫీస్‌ ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేయాలని చూస్తోంది. సేల్స్‌ఫోర్స్‌ కూడా అదనపు ఇంజనీర్ల అవసరం లేదని, ఏఐ టూల్స్‌ అత్యంత వేగంగా చేస్తున్నాయి. గతంలో పది మంది చేసే పనిని ఇప్పుడు ఇద్దరు ముగ్గురు సీనియర్ డెవలపర్లు ఏఐ సాయంతో పూర్తి చేయగలుగుతున్నారు. దీని వల్ల ఎంట్రీ లెవల్స్‌ జాబ్స్ లేదా ప్రెషర్లు అవసరం భారీగా తగ్గుతోంది. 

నాస్కామ్‌ చెప్పిందేంటీ? 

నాస్కామ్‌ 2026 స్ట్రాటజిక్ రివ్యూ ప్రకారం ఐటీ రంగం ఆదాయం పెరుగుతున్నా, ఉద్యోగాల కల్పన మాత్రం ఆ స్థాయిలో లేదు. కంపెనీల మొత్తం ఆదాయంలో ఏఐ వాటా ఐదు నుంచి ఆరు శాతానికి చేరింది. 2026 నాటికి పది లక్షల ఏఐ సంబంధిత ఉద్యోగాలకు డిమాండ్ ఉండబోతోంది. కానీ అవి పాత పద్ధతుల్లో ఉండే ఉద్యోగాలు కావు. 

సవాళ్లతోపాటే అవకాశాలు

ఈ మార్పు వల్ల ఫ్రెషర్లకు కొత్త సవాళ్లు ఎదురవుతున్న మాట నిజమే, సంవత్సానికి పదిహేను లక్షల మంది ఇంజినీర్లు గ్రాడ్యుయేట్లుగా వస్తున్నా, కేవలం నలభై శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఉద్యోగానికి పనికి వచ్చే స్కిల్ కలిగి ఉంటున్నారు. మాస్ రిక్రూట్‌మెంట్లు తగ్గిపోవడ వల్ల పోటీ విపరీతంగా పెరుగుతుంది. డిగ్రీ సర్టిఫికెట్ కంటే స్కిల్‌కే ప్రాధాన్యత లభిస్తుంది. బేసిక్ జావా, సీ వంటి లాంగ్వేజ్‌లు తెలిసినంత మాత్రాన ఉద్యోగం దొరకదు. 

ఏఐ స్కిల్ ఉన్న వారికి వేతనాల్లో 28 శాతం వరకు ప్రీమియం లభిస్తోంది. ప్రాంప్ట్ ఇంజినీర్లు, ఏఐ ఆర్కెస్ట్రేటర్స్‌, హ్యూమన్‌- ఏఐ మేనేజర్లు వంటి కొత్త రకాల ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. మొత్తంగా ఏఐ వల్ల 02 మిలియన్ ఉద్యోగాలు ప్రభావితమైనా, 170 మిలియన్ కొత్త అవకాశాలు వస్తాయని అంచనాలు ఉన్నాయి.