Delhi University principal:  ఎండలు ముదురుతున్నాయి. అందరికీ వేడిగానే ఉంటుంది. చల్లదనం కోసం ఏసీలు, కూలర్లు పెట్టుకుంటారు. అయితే కాలేజీల్లో మాత్రం ఇలాంటి అవకాశాలు ఉండవు. అందుకే  ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన లక్ష్మీబాయి కళాశాల ప్రిన్సిపాల్  ప్రత్యూష్ వత్సల పిల్లలకు చల్లగా ఉండాలని కొత్త ప్రయత్నం చేశారు.  క్లాస్‌రూమ్ గోడలకు ఆవు పేడ పులిమారు. వేసవిలో  చల్లగా ఉండేందుకు ఇలా చేసినట్లుగా సమర్థించుకున్నారు. అయితే పేడ పూస్తే చల్లగా ఉంటుందని ఎవరు చెప్పారని ఆమెను చాలా మంది ప్రశ్నించారు. అందుకే ఆమె  ఇది తమ పరిశోధనలో భాగమని..  ఆవు పేడ వాడకం వల్ల క్లాస్‌రూమ్‌లు చల్లగా ఉంటాయని, ఇది పర్యావరణ అనుకూలమైన పద్ధతి అని  చెప్పుకొచ్చారు. తమ పరిశోధనా ఫలితాలను వారం రోజుల్లో వెల్లడిస్తారమని కవర్ చేసుకున్నారు.  

 ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంపై చర్చలు జరిగాయి, కొందరు ఈ చర్యను పర్యావరణ హితమైన ఆలోచనగా సమర్థించగా, మరికొందరు విద్యాసంస్థలో ఇలాంటి పద్ధతులు సముచితం కాదని విమర్శించారు.  

 ప్రిన్సిపాల్ చర్య విద్యార్థులు, ఉపాధ్యాయులు, మరియు సమాజంలో విస్తృత చర్చకు దారితీసింది. కొందరు దీనిని ఆరోగ్యకరమైనదిగా భావించారు. కొంత మంది  హానికరంగా అభిప్రాయం వ్యక్తం చేశారు.  

 ఈ సంఘటనపై ఢిల్లీ యూనివర్సిటీ యాజమాన్యం లేదా ఇతర అధికారుల నుండి అధికారిక స్పందన లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం విస్తృత చర్చ జరుగుతోంది. వారం రోజుల తర్వాత ఆమె ఫలితాలను ప్రకటిస్తే... చాలా చల్లగా ఉందని అనుకుంటే.. ఆవుపేడల్ని పులిమేసుకునేందుకు చాలా మంది రెడీ అవుతారేమో.