ఛాయ్‌వాలా కూతురు సీఏ పాస్
ఛార్టెడ్ అకౌంటెంట్(C.A.)...కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో చదివిన విద్యార్థులకే ఒక పట్టానా అంతుచిక్కని కోర్సు..ఒక్క సబ్జెక్ట్‌లో ఒక్క మార్కు తక్కువ వచ్చినా..కోర్సు మొత్తం మళ్లీ మొదటి నుంచి చదవాల్సిందే.రోజుకు పదిగంటలుపైగా కష్టపడి చదివినా...పాసవుతామన్న గ్యారెంటీ లేదు. అలాంటి క్లిష్టమైన కోర్సు చదవాలని నిశ్చయించుకుంది దిల్లీ(Delhi)లోని ఓ మురికివాడకు చెందిన విద్యార్థిని. వారు ఉండే బస్తీలో అమ్మాయిలు బడికి పోవడమే గగనమైతే...ఈ విద్యార్థి మాత్ర ఏకంగా సీఏ కోర్సు చేయాలని నిశ్చయించుకుంది. దీనికి తండ్రి ప్రోత్సాహం తోడైంది.ఇరుగు,పొరుగు వారి మాటలు లెక్కచేయకుండా కూతురికి మరింత స్వేచ్ఛనిచ్చాడు ప్రజాపతి(Prajapathi). అతను దిల్లీలో ఓ చిన్నఛాయ్ దుకాణం నడుపుతుంటాడు. వచ్చే సంపాదన ఇంటి ఖర్చులకే సరిపోదు. అయినప్పటికీ కుమార్తె కోరిక తీర్చడం కోసం మరింత కష్టపడ్డాడు. పదేళ్ల శ్రమకు ఫలితం దక్కింది. ఆయన కుమార్తె అమిత ప్రజాపతి(Amitha Prajapathi) సీఏ క్రాక్ చేసింది. ఆ ఆనందంతో తండ్రిని కౌగిలించుకుని నడిరోడ్డుపైనే ఏడ్చేసింది. ఆ వీడియోను, తన పదేళ్ల శ్రమను అక్షరీకరించి లింక్‌డ్ ఇన్(Linked In)లో పోస్టు చేసింది. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
క్రేజీ..బట్ నాట్ ఈజీ
మురికివాడల్లో నివసించే వారు క్రేజీ మైండ్స్‌తో ఉంటారని నానుడి. అది నిజమే ఎందుకంటే నా మైండ్స్ క్రేజీగా లేకుంటే నేను ఇక్కడి వరకు వచ్చి ఉండేదాన్ని కాదు..ఇది అమిత ప్రజాపత్రి లింక్డిన్ పేజీలో రాసిన వాఖ్యాలు.పెద్దపెద్ద కలలు కనడమే కాదు..వాటిని కష్టపడి సాకారం చేసుకోవాలంటారు. మురికివాడలో పుట్టిన అమిత అలాంటి పెద్దకలే కన్నది. ఆ కల ఫలించేలా చేయడానికి తన తండ్రి పడిన కష్టాన్ని అక్షరరూపంలో అందరికీ వివరించింది.' నాన్నా నన్ను సీఎలో చేర్పించేందుకు నువ్వు ఎంత కష్టపడ్డావో నా కళ్లముందు సాక్షాత్కరిస్తోంది. ఎంతోమంది ముందు అవమానాలు పడ్డావ్, మాటలు అనిపించుకున్నావ్..అవన్నీ నాకు తెలుసు. ఆడపిల్లలను చదివించి డబ్బులు వృథా చేసుకోకు...ఆ డబ్బులు పెట్టి మంచి ఇల్లు కట్టిచుకోమని నీకు ఎంతోమంది ఉచిత సలహాలు ఇచ్చినా నువ్వు పట్టించుకోలేదు. నా తెలివితేటలపై నమ్మకంలేని వాళ్లు సూటిపోటి మాటలు అన్నా ఎప్పుడూ నిరాశ నా దరిచేరనీయలేదు. నాపై నమ్మకం ఉంచి నన్ను ప్రోత్సహించావ్. నన్ను భారంగా కాకుండా బాధ్యతగా పెంచావ్ అని అమిత ఎమోషనల్ పోస్టు చేశారు.
అందరూ కూతురుకు ఖర్చు చేసే సొమ్ముతో సొంత ఇల్లు కట్టుకోమని మా నాన్నకు సలహా ఇచ్చారు. ఇప్పుడు నేనే మా నాన్నకు సొంత ఇల్లు కట్టించి ఇచ్చే స్థితికి చేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
పుత్రికోత్సాహం
తండ్రిని హత్తుకుని నేను సీఏ పాసయ్యానంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆ తండ్రి కళ్లల్లోనూ ఆనందభాష్పాలు రాలాయి. పుత్రికోత్సాహంతో ఆయన గుండె బరువెక్కింది. తన కుమార్తె పదేళ్ల కష్టానికి ఫలితం దక్కిందని ఆనందపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అమితను అందరూ అభినందించడమేగాక, కుమార్తెను ప్రోత్సహించిన తండ్రిని సైతం మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.