Fog in Delhi:


ఢిల్లీలో మంచు దుప్పటి..


ఢిల్లీని మంచు దుప్పటి కమ్మేసింది. కొత్త ఏడాది వేళ కనీసం బయటకు వచ్చేందుకు కూడా వాతావరణం సహకరించడం లేదు. పొగ మంచుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఢిల్లీవాసులు. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. 10 డిగ్రీల కన్నా తక్కువే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్ఠంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఢిల్లీతో పాటు ఉత్తరాది మొత్తం పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. పంజాబ్, రాజస్థాన్, యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌లో చలి గాలులు వణికిస్తున్నాయి.





రోడ్లపై నిద్రించే వాళ్ల కోసం ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నైట్ షెల్టర్ హోమ్స్‌లో వాళ్లకు ఆశ్రయం కల్పిస్తోంది. మరో వారం రోజుల పాటు ఇలాగే పొగ మంచు కమ్ముకునే అవకాశముందని IMD అంచనా వేసింది. మరో వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కన్నా తక్కువే నమోదవుతాయని వెల్లడించింది.





ఇక రోజురోజుకీ ఎయిర్ క్వాలిటీ కూడా పడిపోతోంది. Central Pollution Control Board (CPCB) లెక్కల ప్రకారం...ప్రస్తుతానికి ఢిల్లీలో Air Quality Index 358 గా నమోదైంది. అంటే Very Poor Category. ఆనంద్‌ విహార్‌లో AQI 372, ఆర్‌కే పురంలో 393గా నమోదైంది. ఈ పొగమంచు కారణంగా ప్రజా రవాణా వ్యవస్థకీ అంతరాయం కలుగుతోంది. దాదాపు 21 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. యూపీ, మధ్య ప్రదేశ్, పంజాబ్, హరియాణా, ఢిల్లీకి అలెర్ట్ జారీ చేసింది IMD. మరో మూడు రోజుల పాటు అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇటీవల పొగమంచు (Delhi Pollution) కారణంగా యూపీలోనే రోడ్‌లపై పలు చోట్ల యాక్సిడెంట్‌లు జరిగాయి. ముందు ఏముందో కనిపించక వాహనాలు ఢీకొట్టుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా 12 మంది గాయపడ్డారు. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఎక్కువగా ప్రమాదాలు జరిగాయి. బరేలీలో ఓ ట్రక్‌ వేగంగా ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది.