Ectomorph: 


వాళ్ల బాడీ ఇలా ఉంటే...కాస్త నిఘా పెట్టండి..


దొంగలంటే గళ్లలుంగీ, చేతిలో కత్తి, మొహంపైన ఓ పుట్టుమచ్చ....వెయిట్ వెయిట్...ఏ కాలం సంగతి చెబుతున్నావ్ బాస్. మరీ పాత చింతకాయ పచ్చడిలాగున్నావే అంటారా. నిజమే ఇప్పుడా వేషంతో ఏ ఒక్క దొంగ కూడా కనబడడు. వాళ్లూ అప్‌డేట్ అయిపోయారు. ఇప్పుడు జరుగుతున్న చోరీలే వాళ్లెంత అడ్వాన్స్‌డ్ అయ్యారో చెప్పేస్తున్నాయి. మరి...ఇంత అప్‌డేట్ అయిపోయి, మామూలు జనాల్లోనే తిరుగుతున్న దొంగల్ని ఎలా గుర్తుపట్టటం..? ఇదిగో ఈ ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు దిల్లీ పోలీసులు. జనాల్లో చోరులు ఎవరో ఇట్టే కనిపెట్టే టిప్స్ కొన్ని చెప్పారు. ఇకపై ఏ పోలీస్ అయినా సరే, ఈ టిప్స్‌ ఫాలో అవుతూ జాగ్రత్తగా గమనిస్తే దొంగల్ని సులువుగా పట్టుకోవచ్చని ఉన్నతాధికారులు అంటున్నారు. ఫలానా శరీరాకృతి ఉన్న వాళ్లపై నిఘా ఉంచండి అంటూ ఓ సర్కులర్ పాస్ చేశారు. "పొడుగ్గా, సన్నగా కండలు తక్కువగా ఉండేవాళ్లను గమనిస్తూ ఉండండి" అని ఆదేశించారు. ఇంగ్లీష్‌లో ఈ పర్సనాలిటీని Ectomorph అని పిలుస్తారు. కాస్త ప్రత్యేకంగా అనిపించే బైక్‌ నడిపేవారిని, పాడైపోయిన హై ఎండ్‌ బైక్స్‌ని నడిపేవారిపై నిఘా ఉంచాలని స్పష్టం చేసింది దిల్లీ పోలీస్ విభాగం. హెల్మెట్ లేకుండా నడపటం సహా, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవకపోవటం, జిగ్‌జాగ్‌గా వెళ్లటం లాంటివి కనిపిస్తే వారిని అనుమానితులుగా గుర్తించాలని వెల్లడించింది. వీరిని "రెడ్ ఫ్లాగ్స్‌"గా పరిగణించాలని చెప్పింది. 


ఈ ఎక్టోమార్ఫ్‌ బాడీ అంటే ఏంటి..? 


ఎత్తుకు తగ్గట్టుగా చిన్న భుజాలతో పాటు కాస్త కండలు తక్కువగా ఉన్నా బలంగా ఉండే పర్సనాలిటీని ఎక్టోమార్ఫ్ అంటారు. వీరిలో మెటబాలిజం ఎంతో వేగంగా ఉంటుంది. వీరు ఒకవేళ బరువు పెరిగినా, చాలా సులువుగా తగ్గుతారు. యావరేజ్ హైట్‌ కన్నా కాస్త ఎత్తుగా ఉంటారు. మెటబాలిజం ఎక్కువగా ఉండటం వల్ల ఆహారంలోని క్యాలరీలు చాలా వేగంగా కరిగిపోతాయి. సరైన ఆహారం తీసుకోకపోయినా, రోజూ వ్యాయామం చేయకపోయినా వెంటనే శరీరంపై ప్రభావంపడుతుంది. తొందరగా నీరస పడిపోతారు. ఈ పర్సనాలిటీ ఉన్న వాళ్లు కొవ్వు పదార్థాలు తిన్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే...మెటబాలిజం ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం ఎక్కువ సేపు కొవ్వుని నిల్వ ఉంచుకోలేదు. వెంటనే కరిగిపోవటం వల్ల కండలు కూడా త్వరగా ఎదగవు. అందుకే...ఇలాంటి వాళ్లు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటంతో పాటు, రోజూ ఎక్సర్‌సైజ్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అలా అని మితిమీరి వ్యాయామం చేసినా...ఎక్టోమార్ఫ్  బాడీ ఉన్న వాళ్లకు చాలా ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. మొత్తానికి దిల్లీ పోలీసు విభాగం మాత్రం ఈ ఎక్టోమార్ఫ్‌ టైప్ బాడీ ఉన్న వాళ్లపై నిఘా ఉంచమని చెప్పటం పెద్ద హాట్‌ టాపిక్‌గా మారింది.