Cylinder Blast: అది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతం. జీడిమెట్ల పారిశ్రామికలోని రాంరెడ్డి నగర్. ఉన్నట్టుండి అరుపులు వినిపించాయి. పారిశ్రామిక వాడ కాబట్టి లేబర్స్ ఎక్కువగా ఉంటారు అక్కడ. పలు చోట్ల తరచూ గొడవలు, కయ్యాలు, వాగ్వాదాలు సర్వ సాధారణం. అందుకు సంబంధించిన అరుపులే అనుకుని ఊరుకున్నారు స్థానికులు. ఆ అరుపులు, కేకలు, కొట్లాట తరహాలో గట్టి గట్టిగా అరుచుకోవడం కాసేపటి వరకు సాగింది. ఒకరో లేదా ఇద్దరో ఉన్నట్లు లేరు. చాలా ఎక్కువ మందే ఉన్నట్టు అనిపిస్తోంది ఆ గొడవ తరహా అరుపులు వింటుంటే. ఈ అరుపులు ఉదయం కొద్దిసేపు వచ్చాయి క్రమంగా ఆగిపోయాయి. స్థానికులు దాని గురించి ఎప్పట్లాగే పెద్దగా పట్టించుకోలేదు.


భారీ శబ్ధంతో ఒక్కసారిగా బ్లాస్ట్..


అది రాత్రి సమయం. రాత్రి 8 గంటలు అవుతోంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. డ్యూటీలు ముగించుకుని ఇళ్లకు చేరిన వారు.. వంటావార్పు పూర్తి చేసుకుని తిందామని కూర్చున్న వారు.. వారి పనులు చేసుకుంటున్నారు. అంతలోనే ఆ రాంరెడ్డి నగర్ ప్రాంతంలో ఉన్నట్టుండి భారీ శబ్ధం. ఏదో పేద్ద బాంబు పేలినట్టు. అక్కడ ఉన్న వారు అంత పెద్ద శబ్ధంతో ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందా అని ఇళ్ల నుండి బయటకు వచ్చారు. పక్కనున్న ఇంట్లో వారిని ఏమిటి ఆ శబ్ధం అని అడిగినా వారికీ తెలియదు అనే సమాధానమే. అంతలోనే కొందరు మరో వైపు పరుగులు పెట్టారు. ఏమిటా అని చూస్తే ఓ గదిలో సిలిండర్ పేలిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. 


బ్లాస్ట్ జరిగిన రూములో ఎంతమంది ఉంటున్నారు?


వాళ్లంతా బ్యాచ్ లర్స్.. జార్ఖండ్ రాష్ట్రం నుండి ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చారు. వాళ్లు మొత్తం 8 మంది ఆ గదిలో ఉంటున్నారు. అక్కడే ఉంటూ స్థానికం జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉండే పలు పరిశ్రమల్లో డైలీ లేబర్లుగా పని చేస్తున్నారు. ఉదయం జరిగిన గొడవ వీరి మధ్యే అరుపులు వినిపించింది ఈ రూము నుండే అని స్థానికులు చెప్పారు. 


మంటలు, కూలిపోయిన గోడలు


సిలిండర్ బ్లాస్ట్ కావడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఆ పేలుడు ధాటికి ఇంటి గోడ కూలిపోయింది. మంటలు చెలరేగడంతో.. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను అదుపు చేశారు.


ఎంత మంది చనిపోయారు?


సిలిండర్ బ్లాస్ట్ లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతులను నబిబొద్దిన్, బిరేందర్ లుగా గుర్తించారు. ఆ గదిలో మరో 5 సిలిండర్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. 


బ్లాస్ట్ ఎలా జరిగింది?


ప్రాథమిక దర్యాప్తు అనంతరం పూర్తి సమాచారం తెలుపుతామని బాలానగర్ ఏసిపి గంగారాం తెలిపారు. స్నేహితుల మధ్య జరిగిన గొడవలతో గ్యాస్ సిలిండర్ ను పేల్చినట్లు స్దానికులు భావిస్తున్నారు. ఇది హత్యా లేక ప్రమాదవశాత్తు జరిగిన ఘటననా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని జీడిమెట్ల పోలీసులు తెలిపారు.