Swati Maliwal Assault Case: ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ దాడి కేసులో కీలక పరిణామం జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మే 13వ తేదీన ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లినప్పుడు బిభవ్ తనపై దాడి చేశాడని స్వాతి మలివాల్ ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 7-8 సార్లు చెంప దెబ్బలు కొట్టాడని, ఆ తరవాత ఛాతి కడుపులో తన్నాడని అందులో పేర్కొన్నారు. పీరియడ్స్ ఉన్నాయని చెప్పినా వినకుండా ప్రైవేట్ పార్ట్స్‌పైనా తన్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్‌గా బిభవ్ కుమార్ కూడా ఫిర్యాదు చేశాడు. అయితే...స్వాతి మలివాల్ కంప్లెయింట్ ఆధారంగా కేసు విచారణలో భాగంగా బిభవ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఢిల్లీ రాజకీయాల్ని వేడెక్కిస్తోంది ఈ ఘటన. ఇదంతా బీజేపీ కుట్ర అని ఆప్ ఆరోపిస్తోంది. తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ తేల్చి చెబుతోంది. 






స్వాతి మలివాల్ కంప్లెయింట్ ఆధారంగా బిభవ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది జరిగిన రెండు రోజులకే అదుపులోకి తీసుకున్నారు. అయితే...తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా పోలీసులు దౌర్జన్యంగా తీసుకెళ్లిపోయారంటూ నిందితుడి తరపున న్యాయవాది ఆరోపించారు. కనీసం అతడిని కలిసేందుకు కూడా అనుమతినివ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ఎలాంటి వివరాలూ ఇవ్వలేదని అన్నారు. "పోలీసుల నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం మాకు అందలేదు. విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తామని పోలీసులకు ఈమెయిల్ పంపాం" అని వెల్లడించారు. అటు ఆప్‌ లీగల్ సెల్‌ కూడా పోలీసుల తీరుపై మండి పడుతోంది. విచారణకు సహకరిస్తామని చెప్పాక కూడా బిభవ్‌ కుమార్‌తో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తోంది.


ఈ కేసు బీజేపీ, ఆప్ మధ్య యుద్ధానికి దారి తీసింది. స్వాతి మలివాల్‌ని ఆప్ వేధిస్తోందని బీజేపీ ఆరోపిస్తుండగా..ఇదంతా బీజేపీ కుట్రే అంటూ ఆప్‌ ఎదురు దాడికి దిగింది. పైగా స్వాతి మలివాల్‌ బీజేపీతో టచ్‌లో ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై మలివాల్ గట్టిగానే స్పందించారు. 20 ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న తనను బీజేపీ ఏజెంట్‌గా ప్రచారం చేస్తున్నారంటూ మండి పడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. ఆప్‌ పార్టీకి అబద్ధాలు చెప్పడం అలవాటైపోయిందని, స్వాతి మలివాల్‌ తమతో టచ్‌లో ఉందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. ఘటన జరిగినప్పుడు తనకు మద్దతునిచ్చిన ఆప్‌ ఆ తరవాత యూటర్న్ తీసుకుందని స్వాతి మలివాల్ ఫైర్ అవుతున్నారు. అలా అని దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని బీజేపీకి చురకలు అంటించారు. 


Also Read: Prajwal Revanna Case: ప్రజ్వల్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదు, దేవెగౌడ కీలక వ్యాఖ్యలు