Thar car falls from second floor: కొత్త కారు కొన్నప్పుడు చాలా సెంటిమెంట్లు ఉంటాయి. అలాంటి సెంటిమెంట్లలో ఒకటి నిమ్మకాయలను తొక్కించడం. నిమ్మకాయలను తొక్కిస్తున్నప్పుడు ఓ కారు..రెండో అంతస్తు నుంచి కిందకు పడిపోయింది. అప్పుడే డెలివరి తీసుకుంటున్న వారి గుండెల్లో రాయి పడింది. 

 ఢిల్లీలోని ఓ మహీంద్రా షోరూమ్‌లో కొత్తగా కొనుగోలు చేసిన మహీంద్రా థార్ వాహనం ఆచారం సందర్భంగా ఊహించని విధంగా షోరూమ్ గాజు తలుపులను ఢీకొని బయటకు దూసుకెళ్లిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.  నమ్మకాల్లో భాగంగా నిమ్మకాయను చక్రం కింద నలపడం ద్వారా వాహనానికి శుభం జరగాలని అనుకున్నారు. కానీ  అనుకోకుండా వాహనం ముందుకు కదలడంతో  రెండో అంతస్తు నుచి కింద పడిపోయింది. 

కస్టమర్ నిమ్మకాయను చక్రం కింద ఉంచే సమయంలో వాహనం గేర్‌లో ఉండి, యాక్సిలరేటర్‌పై అనుకోకుండా ఒత్తిడి పడటం వల్ల వాహనం ముందుకు దూసుకెళ్లినట్లు భావిస్తున్నారు. స్థానికులు ,  షోరూమ్ సిబ్బంది ఈ ఘటనతో ఆశ్చర్యపోయారు. షోరూమ్  అద్దాలు  ధ్వంసమైనప్పటికీ, గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది, దీనిపై నెటిజన్లు హాస్యాస్పదంగా స్పందిస్తూ, "నిమ్మకాయ ఆచారం కంటే వాహన గేర్‌ను తనిఖీ చేయడం ముఖ్యం" అంటూ వ్యాఖ్యలు చేశారు .

మహీంద్రా సంస్థ ఈ ఘటనపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే, షోరూమ్ యాజమాన్యం ఈ ఘటనను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.  ఈ కారును అక్కడి నుంచి షెడ్డుకు తీసుకెళ్లి బాగు చేయించుకుని ఇంటికి తీసుకెళ్లాలి. ఇప్పుడు దానికి  ఇన్సూరెన్స్ వస్తుందా లేదా అన్నదానిపైనా చర్చ జరుగుతోంది. ఇన్సూరెన్స్ కట్టేసి ఉంటారు కాట్టి  వస్తుందని కొందరంటున్నా.. ప్రమాదం జరిగిన తీరు .. ఇంకా షోరూం బయటకు రాలేదు కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదని కొంత మంది అంటున్నారు.