Delhi Metro News: ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు రీల్స్ చేస్తున్నారు. పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం, డైలాగ్స్ చెప్పడం.. ఇలా తమకు ఉన్న టాలెంట్ తోనే రీల్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. అయితే ఇంట్లో కాకుండా ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేసేస్తున్నారు చాలా మంది. ముఖ్యంగా బస్సులు, రైల్లు, ఆటోలను కూడా వదలడం లేదు. కాస్త వీలు దొరికిందంటే చాలు రీల్స్ చేసేస్తూ.. నెట్టింట పెట్టేస్తున్నారు. ఇలాంటి వాళ్లకే ఢిల్లీ మెట్రో షాకిచ్చింది. ప్రజారవాణా వ్యవస్థల్లో రీల్స్ చేయడాన్ని నిషేధిస్తున్నట్లు వెల్లడించింది. ఈక్రమంలోనే ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ వినూత్న ప్రకటనను జారీ చేసింది. 


జానీ జానీ యెస్ పాపా.. ఓపెన్ యువర్ కామెరా నో నో నో..!


ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ సంస్థ ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన చేసింది. అందులో మెట్రోలో రీల్స్ చేయరాదని వార్నింగ్ ఇస్తూ.. మార్గదర్శకాలను జారీ చేసింది. అందులో జానీ జానీ యెస్ పాపా.. మేకింగ్ రీల్స్ ఇన్ ది మెట్రో నో పాపా.. అని అడ్వైజరీలో పేర్కొంది. దీనికి ఓపెన్ యువర్ కామెరా.. నా నా నా అంటూ రాసుకొచ్చింది. ప్రయాణికులకు అసౌకర్యం కల్గించే ఇలాంటి కార్యకలాపాలను ఢిల్లీ మెట్రోలో నిషేధిస్తున్నామని వెల్లడించింది. డీఎంఆర్సీ చేసిన ఈ పోస్టుకు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. 






ఢిల్లీ మెట్రో సర్వీసుల నాణ్యతే కాదు.. హస్యం కూడా మామూలుగా లేదంటూ ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు. వార్నింగ్ కూడా చాలా స్వీట్ గా ఉందంటూ మరో వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఇంత ఫన్నీగా చెప్తే.. కచ్చితంగా రీల్స్ చేయమంటూ మరికొంత మంది రాసుకొచ్చారు. 


ఢిల్లీ మెట్రో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ ట్రైన్‌లలో ఏదో అభ్యంతరకరమైన సంఘటనలు జరగడం, ఆ వీడియోలు వైరల్ అవడం కామన్ అయిపోయింది. ఈ మధ్య కొంత మంది యువకులు మెట్రోలో రచ్చ చేశారు. మెట్రో రైల్ కోచ్‌ డోర్‌ మూసుకుపోతుంటే...కావాలనే కాళ్లు అడ్డం పెట్టి ఆపేశారు. ఇలా ఒక్కసారి కాదు. పదేపదే అలాగే చేస్తూ మెట్రో కదలకుండా చేశారు. ఫలితంగా...ప్రయాణికులు ఇబ్బందికి గురయ్యారు. ఆ గ్యాంగ్ మాత్రం పగలబడి నవ్వుకుంటూ వీడియో తీసింది. కరోల్ బాగ్ స్టేషన్‌లో మెట్రో ఆగినప్పుడు ఈ ఘటన జరిగింది. ఈ గ్యాంగ్ కారణంగా మెట్రో ఆలస్యంగా నడిచిందని కొందరు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. అమన్ అనే ఓ నెటిజన్ ఈ వీడియోని ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఢిల్లీ మెట్రోని ట్యాగ్ చేస్తూ.."ఇలాంటి వాళ్ల వల్ల మెట్రో లేట్‌గా నడుస్తోంది" అని ట్వీట్ చేశాడు.


ఓసారి ఓ యువకుడు మెట్రోలో ఉన్నట్టుండి జేబులో నుంచి బ్రష్ తీసి అక్కడే తోముకోవడం మొదలు పెట్టాడు. ఇది చూసి చుట్టూ ఉన్న వాళ్లంతా షాక్ అయ్యారు. "వీడేంటి ఇలా చేస్తున్నాడు" అన్నట్టుగా వింతగా చూశారు. ఓ అమ్మాయైతే ఫోన్ మాట్లాడటం ఆపేసి మరీ ఆ యువకుడిని అలాగే చూస్తూ కూర్చుంది. ఫస్ట్ షాక్ అయిన ఆ యువతి..తరవాత నవ్వుకుంది. ఆ యువకుడు అలా బ్రష్ చేసుకుంటూ ఒక్కచోటే ఆగిపోలేదు. మెట్రోలని బోగీలన్నీ చుట్టొచ్చాడు. అలా బ్రష్ చేసుకుంటూనే నడుచుకుంటూ దర్జాగా నడుచుకుంటూ వెళ్లాడు. ప్రతి బోగిలోనూ అందరూ అతడిని చూసి ఆశ్చర్యపోయారు.