Delhi MCD Election 2022:
కార్యకర్తలతో సరదాగా..
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీని వెనక్కి నెట్టి మెజార్టీతో దూసుకుపోయింది. దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ABP Newsతో మాట్లాడిన ఆయన...ఇది చాలా గొప్ప విజయం అని ఆనందం వ్యక్తం చేశారు. ఇది ఢిల్లీ ప్రజల విజయం అని వ్యాఖ్యానించారు. ఫలితాలు వెలువడిన వెంటనే పార్టీ కార్యాలయానికి వెళ్లిన కేజ్రీవాల్..చాలా సంతోషంగా కనిపించారు. కార్‌లో నుంచే కార్యకర్తలను పలకరిస్తూ ఉత్సాహం నింపారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కూడా స్పందించారు. "15 ఏళ్ల చెత్త పరిపాలనకు మేం స్వస్తి పలికాం" అంటూ బీజేపీకి చురకలు అంటించారు. అంతే కాదు. బీజేపీకి ప్రత్యామ్నాయం ఆప్ పార్టీయేనని స్పష్టం చేశారు. ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా ఆప్ విజయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విటర్ వేదికగా స్పందించారు. "ఆమ్ ఆద్మీ పార్టీని నమ్మిన ఢిల్లీ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పార్టీని (బీజేపీ) ఓడించి నిజాయతీ గల పార్టీకే అండగా నిలబడ్డారు" అని అన్నారు.
సంబరాలు..
మ్యాజిక్ ఫిగర్ 126 సీట్లు దాటడంతో ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర కోలాహలంగా ఉంది. మరోవైపు ఎంసీడీ చరిత్రలోనే అరుదైన సంఘటన జరిగింది. సుల్తాన్‌పురి-ఏ వార్డులో ఆప్ తరపున పోటీ చేసిన బోబి విజయం సాధించారు. దీంతో తొలిసారి ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఎంసీడీ సభ్యులుగా ఎన్నికైనట్లయింది. దిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ హర్షం వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్ సర్వేలు MCD పీఠం ఆప్‌దేనని స్పష్టం చేశాయి. 15 ఏళ్లుగా భాజపా చేతిలోనే ఉన్న్ MCDని ఈసారి
ఆప్ కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశాయి. 250 వార్డులకు గాను ఆప్ 155 వార్డుల్లో విజయం సాధిస్తుందని సర్వేలు తేల్చాయి.