Delhi Air Pollution:


సగం కాలుష్యం వాటి వల్లే..


ఢిల్లీలో వాతావరణ పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. దాదాపు 15 రోజులుగా అక్కడి ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. దీపావళికి ముందే అక్కడి AQI "Poor"గా నమోదైంది. దీపావళి తరవాత "Very Poor"గా నిర్ధరణ అయినట్టు అధికారులు వెల్లడించారు. నిర్మాణ పనులపై నిషేధం విధించినప్పటికీ...వాతావరణంలో ఎలాంటి మార్పులూ కనిపించటం లేదు. వీటితో పాటు మరి కొన్ని దిద్దుబాటు చర్యల్నీ మొదలు పెట్టింది ఆప్ సర్కార్. వీలైనంత వరకూ ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించింది. ఎయిర్ క్వాలిటీ 376కి పడిపోయిందని, రోడ్లపైకి పెద్ద ఎత్తున వాహనాలు తిరగకుండా నిలువరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ప్రైవేట్ వాహనాలే ఢిల్లీలో 50% మేర కాలుష్యానికి కారణమవుతున్నాయని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటన చేశారు. "అవకాశమున్నంత వరకూ ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి. ప్రైవేట్ వాహనాల్లో ఆఫీస్‌లకు రావడాన్ని తగ్గించండి. షేర్డ్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఎక్కువగా వినియోగించండి. బాణసంచా కాల్చటాన్ని మానుకోండి. కేంద్రం ఎలాంటి మద్దతు అందించక పోవటం వల్ల పంజాబ్‌లో ఇంకా రైతులు గడ్డిని కాల్చుతూనే ఉన్నారు. ఇదీ సమస్యగా మారుతోంది" అని వెల్లడించారు గోపాల్ రాయ్. 






కట్టడి చర్యలు..


అక్టోబర్‌ రాగానే...ఢిల్లీలో కాలుష్య కష్టాలు మొదలవుతుంటాయి. ఈ సారి ఈ సమస్య మరీ తీవ్రంగా కనిపిస్తోంది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ నగరంలో వాయు నాణ్యత దారుణంగా పడిపోయినట్టు వెల్లడించింది. ఎయిర్ క్వాలిటీని "Very Poor"గా నిర్ధరించింది. Graded Response Action Plan (GRAP) అంచనా ప్రకారం..శనివారం నాటికి పరిస్థితులు మరీ దిగజారతాయని తెలిపింది. కాలుష్య తీవ్రతను స్టేజ్-2గా ప్రకటించింది. ఇందులో భాగంగా...కాలుష్య కట్టడికి కొన్ని చర్యలు చేపడతారు. రెస్టారెంట్‌, హోటల్స్‌లో బొగ్గు, కట్టెలు కాల్చడంపై నిషేధం విధిస్తారు. అత్యవసర సేవల్లో తప్ప మిగతా ఎక్కడా డీజిల్ జనరేటర్లు వినియోగించడానికి వీలుండదు. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రిం చేందుకు GRAPని ఇటీవలే తీసుకొచ్చింది ప్రభుత్వం. వాతావరణ పరిస్థితుల్ని బట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలే ఈ ప్లాన్‌ సూచిస్తుంది.మొత్తం నాలుగు స్టేజ్‌లుగా తీవ్రతను విభజించి ఆ స్టేజ్‌కు తగ్గట్టుగా తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తుంది. గుడ్‌గావ్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌ ప్రజలనూ అధికారులు అప్రమత్తం చేశారు. దీపావళి తరవాత కాలుష్య స్థాయి పెరిగిపోవటం వల్ల కట్టడి చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. అత్యవసర నిర్మాణాలు తప్ప మిగతా వాటిపై నిషేధం విధించారు. NCR అంతటా ఈ ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. డిఫెన్స్, రైల్వేస్, మెట్రో పనులకు మినహాయింపు ఉంది. BS-3 పెట్రోల్, BS-4 డీజిల్ ఫోర్ వీలర్ వెహికిల్స్‌పైనా నిషేధం విధించవచ్చని అధికారులు తెలిపారు. 


Also Read: Paper Made From Tree: చెట్ల నుంచి కాగితం ఎలా తయారు చేస్తారో తెలుసా!