Gangster Kala Jathedi Marriage: గ్యాంగ్‌స్టర్ సందీప్ అలియాస్ కాలా జతేడి ఓ ఇంటివాడయ్యాడు. అనురాధా చౌదరి అలియాస్ మేడమ్ మింజ్‌ని పెళ్లాడాడు. ఆమె కూడా గ్యాంగ్‌స్టరే. అనురాధా చౌదరిని రివాల్వర్ రాణిగా పిలుస్తారు. ఢిల్లీలోని ద్వారకాలో ఎంతో ఘనంగా ఈ వివాహం జరిగింది. భారీ భద్రత నడుమ ఈ తంతు ముగిసింది. ఫంక్షన్ హాల్ చుట్టూ పోలీసులు మొహరించారు. సందీప్ తరపు న్యాయవాది పెళ్లి పెద్దగా ఉండి వేల రూపాయలు ఖర్చు చేసి మరీ ఈ వివాహం జరిపించాడు. గ్యాంగ్‌స్టర్ నేరచరిత్రను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. పరిసరాల్లో పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. వాంటెడ్ క్రిమినల్ అయిన సందీప్ అలియాస్ కాలా జతేడీపై రూ.7 లక్షల నజరానా కూడా ఉంది. కేవలం ఈ పెళ్లి కోసమే ఆరు గంటల పెరోల్‌పై బయటకి వచ్చాడు కాలా. అటు అనురాధా చౌదరి అలియాస్ రివాల్వర్ రాణిపైనా ఎన్నో కేసులున్నాయి. ఇద్దరు గ్యాంగ్‌స్టర్‌లో ఇలా పెళ్లి చేసుకోవడం స్థానికంగా ఆసక్తి కలిగించింది.  


హరియాణాలోని సోనీపట్ నుంచి వధువు రివాల్వర్ రాణి ఓ SUV వెహికిల్‌లో వచ్చింది. వీళ్లకి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు నాలుగంచెల భద్రతను ఏర్పాటు చేశారు. వచ్చే అతిథులతో పాటు బంధువులకీ ఇదే స్థాయిలో భద్రత కల్పించారు. ఐడీ ప్రూఫ్ ఉన్న వాళ్లనే లోపలికి అనుమతించారు. గెస్ట్ లిస్ట్‌ని పరిశీలించి మరీ ఒక్కొక్కరినీ లోపలికి పంపించారు. మొబైల్ ఫోన్స్‌ని అనుమతించలేదు. క్రైమ్‌ బ్రాంచ్‌తో పాటు స్పెషల్ సెల్స్‌ విభాగానికి చెందిన సిబ్బంది ఇక్కడ నిఘా పెట్టింది. 2021లో అరెస్ట్ అయిన గ్యాంగ్‌స్టర్ సందీప్‌ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. హైప్రొఫైల్ వ్యక్తి కావడం వల్ల ఇలా ఇంత భద్రత కల్పించి మరీ పెళ్లి జరిపించారు.