Former DSP Praneet Rao Arrest: తెలంగాణలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ వ్యహారంపై సీరియస్‌గా దృష్టి సారించింది. ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి కీలక ఆధారాలను సేకరించిన ప్రభుత్వం.. ఈ మేరకు చర్యలకు సిద్ధమైంది. ప్రణీత్‌రావు పాత్రపై ఆధారాలను సేకరించిన తరువాతే అరెస్ట్‌కు సిద్ధపడినట్టు చెబుతున్నారు. మంగళవారం రాత్రి సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలోనే పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రికిరాత్రి ఆయన్ని హైదరాబాద్‌కు తరలించారు. ఎస్‌ఐబీ లాగర్ రూమ్‌లో హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసిన తరువాత నుంచి ప్రణీత్‌రావు పక్కా ప్లాన్‌తో వ్యవహరించినట్టు చెబుతున్నారు. గడిచిన నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో డీసీఆర్‌బీలో రిపోర్ట్ చేసిన ఆయన.. అక్కడ జాయిన్ అయిన రెండు రోజులకే సిక్ లీవ్ పెట్టినట్టు చెబుతున్నారు. సస్పెన్షన్‌కు వారం రోజులు ముందు నుంచే డీసీఆర్‌బీకి వెళ్లలేదని సమాచారం. సిరిసిల్ల హెడ్‌క్వార్టర్ విడిచి వెళ్లరాదని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ ఆయన తప్పించుకుని తిరుగుతున్నట్టు తేలింది. ఈ క్రమంలోనే ప్రణీత్‌రావు కోసం శ్రీ నగర్ కాలనీలోని ఇంటి వద్ద పోలీసులు నిఘా ఉంచారు.
రాత్రి అరెస్ట్
ప్రణీత్‌రావు మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన విషయం గుర్తించి పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. ఆయన వద్ద ఉన్న సెల్ ఫోన్లను సీజ్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రణీత్‌రావును హైదరాబాద్‌కు తరలించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో స్టేట్‌మెంట్ రికార్డు చేసిన అనంతరం బుధవారం ఉదయం నాంపల్లి కోర్టులో హాజరు పరిచే అవకాశముంది తెలుస్తోంది. ఎస్‌ఐబీలో కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారనో ఆరోపణలపై.. ఎస్‌ఐబీ అడిషినల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు పంజాగుంట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. అంతకుముందు పోలీసులు అదుపులోనే రహస్య ప్రదేశంలోనే ఉన్నారన్న ప్రచారం నడిచింది. కానీ, ప్రణీత్‌రావు కోసం రెండు రోజులు నుంచి సిరిసిల్లలోనే పంజాగుట్ట పోలీసులు మకాం వేసి అరెస్ట్ చేశారు. ప్రణీత్‌రావుతోపాటు ఆయనకు సహకరించిన పలువురు అధికారులను సైతం విచారణ చేయనున్నారు.
డాక్యుమెంట్లు ధ్వంసం
ఎస్‌ఐబీలోని ఎస్‌వోటీ ఆపరేషన్ హెడ్‌గా ఉన్న ప్రణీత్‌రావు.. రాజకీయ నాయకులు, ఎన్జీవోలు, పౌర హక్కుల నేతల వ్యవహారాలతోపాటు మావోయిస్టులు, ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షించారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఫోన్ల ట్యాప్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. తెలంగాణ ఎన్నికల ఫలితాల రోజు రాత్రి 9 గటల సమయంలో ఆయన లాగర్ రూమ్‌కు వెళ్లారు. సుమారు 45 హార్డ్ డిస్క్‌లతోపాటు వందలాది డాక్యుమెంట్లను ధ్వంసం చేసిన ప్రణీత్‌రావు.. ఆ సమయంలో ఎస్‌వోటీ లాగర్ రూమ్ సీసీ కెమెరాలను ఆఫ్ చేయించారు. లాగర్ రూమ్ కరెంట్ సప్లైను నిలిపేసి మరీ లోపలకు వెళ్లినట్టు తేలింది. వేల సంఖ్యలో కాల్ డేటా రికార్డులతోపాటు ఐఎంఈఐ నెంబర్లను ధ్వంసం చేసి.. ఎస్‌ఐబీ ప్రాంగణంలోనే డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లను కాల్చేసి.. లాగర్ రూమ్‌లో ఆనవాళ్లు లేకుండా చేసి వెళ్లిపోయారు. ప్రణీత్‌రావు ఎటువంటి సమాచారాన్ని ద్వంసం చేశాడో నిర్దారణకు రాలేకపోతున్న అధికారులు.. ఆయనపై క్రిమినల్ చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆధారాలు ద్వంసం చేయాలనే ఆదేశాలను ఎవురు ఇచ్చారన్న దానిపైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు బంధువే ఈ ప్రణీత్‌రావు కావడంతో ఆ దిశగానూ పోలీసులు విచారణకు సిద్ధమవుతున్నారు.