Indai News : లోక్‌సభ ఎన్నికల మధ్య ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అతిషి మర్లెనాకు కోర్టు సమన్లు​పంపింది. జూన్ 29న హాజరుకావాలని కోర్టు ఆయనకు పిలుపునిచ్చింది. బీజేపీ, ఆప్‌ నాయకులకు డబ్బు ఎరవేసి వారిని కొనేందుకు ప్రయత్నించిందని ఆతిషి ఆరోపించడంతో ప్రవీణ్ శంకర్ ఏప్రిల్‌ 30తేదీన కోర్టులో ఆమెపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు.


ఢిల్లీ బీజేపీ మీడియా చీఫ్ ప్రవీణ్ శంకర్ కపూర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో రూస్ అవెన్యూ కోర్టు ఈ సమన్లు పంపింది.  ఎలాంటి ఆధారాలు లేకుండా ఢిల్లీ మంత్రి అతిషి పార్టీపై ‘ఆపరేషన్ కమలం’ లాంటి జుగుప్సాకరమైన ఆరోపణ చేశారని అన్నారు. ఈ విషయం పైన ప్రవీణ్ శంకర్ కపూర్ తరపున ఢిల్లీ మంత్రిపై పరువు నష్టం కేసు దాఖలైంది. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ విచ్ఛిన్నం చేసిందని అతిషి నిరాధారంగా ఆరోపించారని ప్రవీణ్ శంకర్ ఆరోపించారు. ఈ కేసులో ఇప్పుడు కేజ్రీవాల్  ప్రభుత్వ మంత్రి అతిషికి కోర్టు సమన్లు ​పంపింది. ఆప్ ను అంతం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని  ఆతిషి గతంలో ఆరోపించారు. నెల రోజుల్లోగా తమ పార్టీలో చేరాలని లేదంటే ఈడీ చేతిలో అరెస్టయ్యేందుకు రెడీగా ఉండాలని తన సన్నిహితుడి ద్వారా బీజేపీ తనను సంప్రదించిందని ఆమె అన్నారు.  తమ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినట్లే  తనను.. తమ పార్టీకి చెందిన సౌరభ్‌ భరద్వాజ్‌, దుర్గేశ్‌ పాథక్‌, రాఘవ్‌ చద్దాలను అరెస్టు చేయించడానికి బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. 


జూన్ 29న హాజరుకావాలన్న కోర్టు 
అతిషి, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ మీడియా విభాగం హెడ్ ప్రవీణ్ శంకర్ కపూర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసును ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. జూన్ 29న కోర్టుకు హాజరు కావాలని ఢిల్లీ మంత్రి అతిషికి కోర్టు సమన్లు ​జారీ చేసింది.


మంగళవారం ఆప్ కు రెండు షాక్ లు 
మంగళవారం ఆప్‌కి రెండు షాక్‌లు తగిలాయి. ఒకవైపు సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌ను మరో వారం పాటు పొడిగించాలన్న పిటిషన్‌పై తక్షణమే విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మరోవైపు పరువు నష్టం కేసులో మంత్రి అతిషికి ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు సమన్లు ​పంపింది.


'ఆప్'కి దెబ్బ మీద దెబ్బ
ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో తీహార్ జైలులో ఉన్నారు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న ఆయన జూన్ 2న లొంగిపోవాల్సి ఉంటుంది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపేందుకు నిరాకరించడంతో  జూన్ 2న కేజ్రీవాల్ తీహార్ వెళ్లే అవకాశం ఉంది. పార్టీలో రెండో నాయకుడు మనీష్ సిసోడియా కూడా గత ఏడాది కాలంగా జైలులోనే ఉన్నారు. ఆప్ నేత సత్యేంద్ర జైన్ కూడా రెండేళ్లుగా జైలులో ఉన్నారు. స్వాతి మలివాల్ కూడా పార్టీపై తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి నివాసంలో అనుచితంగా ప్రవర్తించారని, దాడి చేశారని ఆరోపించారు. ప్రస్తుతం పార్టీలో  చురుకుగా ఉన్న అతిషికి ఇప్పుడు కోర్టు సమన్లు పంపింది. ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకు మే 25న ఓటింగ్ జరిగింది. అయితే చివరి దశ, ఎన్నికల ఫలితాలకు ముందు ఈ సమన్లు ​ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద దెబ్బ.