Rajnath Singh Covid 19:
రాజ్‌నాథ్‌కు రెండోసారి కరోనా
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి ఆయన హోం క్వారంటైన్‌లో ఉన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్‌కి ఈ వైరస్ సోకింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 12,591 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 8 నెలల్లో ఇదే అత్యధికం. ప్రస్తుతానికి యాక్టివ్ కేసులు 65,286కి పెరిగాయి. వైద్యుల బృందం రాజ్‌నాథ్ సింగ్ ఆరోగ్యాన్ని పరిశీలించారు. విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. ఢిల్లీలో Indian Air Force Commanders కాన్ఫరెన్స్‌కు రాజ్‌నాథ్ సింగ్ హాజరవ్వాల్సి ఉంది. కానీ కరోనా సోకడం వల్ల ఆయన వెళ్లడం లేదు. గతేడాది జనవరిలోనూ ఆయనకు కరోనా సోకింది. ఒమిక్రాన్ వేరియంట్ బాగా వ్యాప్తి చెందుతున్న సమయంలో కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకిందని, స్వల్ప లక్షణాలున్నాయని అప్పట్లో ట్వీట్ చేశారు రాజ్‌నాథ్ సింగ్. ప్రస్తుతానికి XBB.1.16 వేరియంట్ వ్యాప్తి చెందుతోందని వైద్యులు వెల్లడించారు. రాజ్‌నాథ్ సింగ్‌కు సోకిన వేరియంట్ కూడా ఇదేనా కాదా అన్నది ధ్రువీకరించాల్సి ఉంది.
పెరుగుతున్న కేసులు..
ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 4 కోట్ల 48 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. డెయిలీ పాటిజివిటీ రేటు 5.46%గా ఉంది. వీక్‌లీ పాజిటివిటీ రేటు 5.32%గా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మొత్తం ఇన్‌ఫెక్షన్లలో 0.15% మేర యాక్టివ్ కేసులున్నాయి. నేషనల్ రికవరీ రేటు 98.67%గా ఉంది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 222 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు అందాయి. మరో 10 నుంచి 12 రోజులపాటు దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరో రెండు వారాల తరువాత దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చాలా మేరకు తగ్గుతుందని వైద్య నిపుణులు వెల్లడించడం ఊరట కలిగిస్తోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 వేరియంట్ ప్రస్తుతం కరోనా వ్యాప్తికి కారణం అన్నారు. కరోనా వ్యాప్తి వేగంగా జరిగి, కేసులు భారీగా నమోదవుతున్నా ఆందోళన అవసరం లేదన్నారు. ఆసుపత్రుల్లో చేరికలు, మరణాలు చాలా తక్కువ మోతాదులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఢిల్లీ, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలలో ఇద్దరు చొప్పున, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, హర్యానా ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కొక్కరు కరోనా కారణంగా మరణించారు. కేరళలో ఐదు వైరస్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. మొత్తంగా 5,31,016 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా లాంటి ఏదైనా వ్యాధులు తక్కువ సమయంలో ఎక్కువ నమోదు కావడం, మరణాలు సంభవిస్తే పాండమిక్ లేదా మహమ్మారి అని ప్రకటిస్తారు. కొంతకాలానికి వ్యాప్తి తగ్గుతుంది. ఈ సమయంలో కేవలం కొన్ని ప్రాంతాలకు కరోనా వ్యాప్తి పరిమితం కావడం, కేసులు నమోదైనా ప్రాణ నష్టం సైతం అతి తక్కువగా ఉండే ఈ స్థితిని ఎండెమిక్ స్టేజీ అంటారు. డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా, లాంటి వ్యాధులు త్వరగా వ్యాప్తి చెంది చివరకు ఎండెమిక్ వ్యాధులుగా గుర్తించారు.
Also Read: Jammu Kashmir: స్కూల్ బాగు చేయాలని రిక్వెస్ట్, చిన్నారి కల నెరవేర్చిన ప్రధాని మోదీ