Dalai Lama:
చైనా మారింది..అయినా వెళ్లను: దలైలామా..
ఆధ్యాత్మికవేత్త దలైలామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనాకు తిరిగి వెళ్లే ఆలోచనే లేదని, ఇండియా తనకు సొంతిల్లు లాంటిదని అన్నారు. భారత్ తనకు శాశ్వత నివాసం అని వెల్లడించారు. "చైనాకు తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు. నాకు భారత్‌లో ఉండటమే ఇష్టం. ఇండియా నాకెంతో నచ్చింది. కంగ్రాలో ఉండాలని అప్పటి ప్రధాని నెహ్రూ నాకు చెప్పారు. ఇదే నాకు శాశ్వత నివాసం" అని స్పష్టం చేశారు. ఇక ఇటీవల తవాంగ్‌లో భారత్, చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణ గురించి ప్రస్తావించగా దానికీ సమాధానమిచ్చారు దలైలామా. "మునుపటి కన్నా పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి. ఐరోపా, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో చైనా వైఖరి కాస్త మారింది. అయినా...చైనాకు వెళ్లాలని మాత్రం అనుకోవడం లేదు" అని వివరించారు.
వేర్పాటు వాది అంటున్న చైనా..
86 ఏళ్ల దలైలామా టిబెట్‌లోని అమ్‌డో ప్రావిన్స్‌లో 1935, జులై 6వ తేదీన జన్మించారు దలైలామా. ఆయనకు లామో థాండప్ అనే పేరు పెట్టారు. కోరికలు తీర్చే దేవత అని దీనర్థం. 1959లో చైనా ప్రభుత్వం అరాచకాలతో వేలాది మంది టిబెటియన్లు తమ ప్రాంతాన్నీ వీడాల్సి వచ్చింది. వారంతా భారత్‌కు వలస వచ్చారు. దలైలామా కూడా వారిలో ఉన్నారు. ముస్సోరి, ఉత్తరాఖండ్‌లో కొంతకాలం పాటు ఉన్నారు. 1960లో ధర్మశాలకు వెళ్లిపోయారు. ఆయనను అందరూ ఆధ్యాత్మికవేత్తగా పిలుస్తుంటే, చైనా మాత్రం "వేర్పాటువాది" అని ముద్ర వేసింది. "సన్ ఆఫ్ ఇండియా"గా అభివర్ణిస్తోంది. అంతకు ముందు వారితో పోల్చితే ఎక్కువ కాలం పాటు జీవించిన దలైలామాగా ఆయన రికార్డు సృష్టించారు. 1989లో నోబుల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ఈ 14వ దలైలామాను టెంజిన్ గ్యాస్టోగానూ పిలుస్తారు. అహింసకు, కరుణకు ఆయనను ప్రతీకగా భావిస్తారు. ఈ ఏడాది జులైలో జమ్ముకశ్మీర్‌లో పర్యటించారు దలైలామా. ఆ సమయంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రజలు తననెప్పుడూ ఓ వేర్పాటువాదిగా చూడలేదన్నారు. అయితే తాను టిబెటియన్ బుద్ధిజం సంప్రదాయాన్ని కాపాడాలని మాత్రమే పోరాటం చేస్తున్నానన్నారు.
Also Read: Besharam Rang Row: 'పఠాన్ సినిమాను నీ కూతురితో కలిసి చూడు'- షారూక్‌కు స్పీకర్ సవాల్