Cyclone Biparjoy: బిపర్‌జోయ్ తుపాను పాకిస్థాన్ పై ప్రభావం చూపించడం ప్రారంభమైంది. ప్రస్తుతానికి ఈ తుపాను కరాచీ నుంచి 380 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. తట్టాకు 390 కిలో మీటర్ల దూరంలో ఉంది. అయితే ఈ తుపాను సింధ్ లోని పురాతన ఓడరేవు అయిన కేటీ బందర్ సమీపంలో తీరాన్ని తాకవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు పాకిస్థానీ న్యూస్ ఛానల్ ఏ.ఆర్.వై ఈ విషయాన్ని వెల్లడించింది.


గుజరాత్ లో 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్


బిపర్‌జోయ్ తుపాను ప్రభావం పాక్ తో పాటు భారత్ పైనా ఉంది. దేశంలోని 9 రాష్ట్రాల్లో తుపాను ప్రభావం కనిపిస్తోంది. గుజరాత్ లోని 8 జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్ తో పాటు, ఆర్మీని సహాయక, రక్షణ కోసం మోహరించారు. 


గుజరాత్- మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు


బిపర్‌జోయ్ సూపర్ సైక్లోన్ కంటే ముందు గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబై, భుజ్, రాజ్ కోట్ లో ఏడుగురు మరణించినట్లు తెలుస్తోంది. గుజరాత్ లోని 7 జిల్లాల నుంచి 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.


ద్వారకలో 400 షెల్టర్ హోమ్ లు


ద్వారకా జిల్లాలో 400లకుపైగా షెల్టర్ హోమ్ లను గుర్తించామని, ప్రజలను షెల్టర్ హోమ్ లకు తరలిస్తున్నామని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. 


పశ్చిమ రైల్వేలో డజన్ల కొద్దీ రైళ్లు రద్దు


తుపాను ప్రభావం రైల్వే కార్యకలాపాలపైనా పడింది. తుపాను హెచ్చరిక కారణంగా పశ్చిమ రైల్వే దాదాపు 95 రైళ్లను రద్దు చేసింది. 


ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ


జూన్ 15వ తేదీన గుజరాత్ లోని మాండ్వి, పాకిస్థాన్ లోని కేటీ బందర్, కరాచీ మధ్య బిపర్‌జోయ్ తుపాను తీరాన్ని తాకనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది గుజరాత్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా వెళ్తుందని భావిస్తున్నారు. తుపానుకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ చేసింది. 


గుజరాత్, మహారాష్ట్ర సహా 9 రాష్ట్రాల్లో ప్రభావం


బిపర్‌జోయ్ తుపాన్ గుజరాత్ కు భారీ నష్టం చేకూర్చుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రకూ తుపాను ముప్పు పొంచి ఉంది. అలాగే లక్షద్వీప్, కేరళ, కర్ణాటక, పశ్చిమ రాజస్థాన్ ప్రాంతాల్లో కూడా తుపాను ప్రభావం వల్ల వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. జూన్ 15 నాటికి బిపర్‌జోయ్ తుపాను గుజరాత్ తీరంలో అడుగు పెడుతుందని అంచనా. పశ్చిమ తీరంలోని ముంబై నుంచి కచ్ వరకు సముద్రంలో ఎగిసిపడుతున్న అలలు, తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీస్తున్నాయి. గుజరాత్ లో తుపానుకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. 


గుజరాత్, మహారాష్ట్రలతో పాటు 9 రాష్ట్రాలపై తుపాను ప్రభావం ఉంటుందని అంచనా. జూన్ 15 సాయంత్రానికి గుజరాత్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా తుపాను ప్రయాణించిన.. కచ్, ద్వారకా, పోర్ బందర్, జామ్ నగర్, రాజ్ కోట్, జునాగఢ్, మోర్బీలలో తుపాను ప్రబావం ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.