Assam-Meghalaya Border:
గిరిజనులు మృతి..
అస్సాం, మేఘాలయా సరిహద్దుల్లో తెల్లవారు జామున ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అక్రమంగా కలప తరలిస్తున్న ట్రక్ విషయంలో తలెత్తిన గొడవ..చినికిచినికి గాలివానైంది. అస్సాం ఫారెస్ట్ గార్డ్స్ ఆ ట్రక్‌ను అడ్డుకోగా...ఘర్షణ మొదలైంది. ఈ దాడిలో మేఘాలయకు చెందిన ఐదుగురు గిరిజనులతో పాటు ఓ అస్సాం ఫారెస్ట్ గార్డ్ కూడా మృతి చెందాడు. ఇది జరిగిన వెంటనే...మేఘాలయాలోని గిరిజన గ్రామ ప్రజలు అస్సాంలోని వెస్ట్ కర్బి అంగలాంగ్ జిల్లాలో ఫారెస్ట్ ఆఫీస్‌పై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ రెండు ఘటనలతో...మరోసారి అస్సాం, మేఘాలయా మధ్య వైరం భగ్గుమంది. పలు చోట్ల వాహనాలకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నట్టుండి ఈ స్థాయిలో ఘర్షణ ఎందుకు జరిగిందన్నది తెలియాల్సి ఉంది. మేఘాలయా సీఎం కొన్రాడ్ సంగ్మా అస్సాం పోలీసులు, ఫారెస్ట్ గార్డ్‌లదే తప్పు అని ఆరోపి స్తున్నారు. "వాళ్లే కావాలని మా వైపు వచ్చి కాల్పులు జరిపారు" అని చెబుతున్నారు. అంతే కాదు. ట్విటర్ వేదికగా...ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షాలను ట్యాగ్ చేస్తూ పోస్ట్‌లు చేశారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని మేఘాలయా మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. అమిత్‌షాను కలిసి ఈ ఘటనలపై చర్చించనున్నారు. అటు అస్సాం ప్రభుత్వం కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలకే విచారణను అప్పగిస్తామని ప్రకటించింది.
రాకపోకలపై ఆంక్షలు..
ఇక అస్సాం మేఘాలయా సరిహద్దు ప్రాంతంలోని ప్రధాన రహదారులపై ఆంక్షలు విధించారు పోలీసులు. ఫలితంగా...ఈ రూట్‌లో వెళ్లే ట్రక్‌లకు ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యావసరాలు సరఫరా చేసే ట్రక్‌లనూ అడ్డుకుంటున్నారు. మేఘాలయా రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతినిస్తున్నారు. అటు అస్సాం పోలీసులు కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు. మేఘాలయాకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు. "ఈ ఆంక్షల కారణంగా డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకో శాశ్వత పరిష్కారం సూచించాలని మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం" అని ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్‌లు కోరుతున్నాయి.
Also Read: Bharat Jodo Yatra: జోడో యాత్రలో జోష్- అన్నయ్యతో కలిసి అడుగులేసిన ప్రియాంక గాంధీ