మొసలిని బంధించిన గ్రామస్థులు..


మొసలి ఓ పిల్లాడిని మింగేసిందన్న కోపంతో మొసలిని 7 గంటల పాటు బంధించారు గ్రామస్థులు. మధ్యప్రదేశ్‌లోని రఘునాథ్‌పూర్ గ్రామ ప్రజలు చేసిన ఈ పనికి అటవీ అధికారులు షాక్ అయ్యారు. మొసలి కాళ్లను కట్టేసి, నోరు మూసివేసే వీల్లేకుండా అలాగే 7 గంటల పాటు ఉంచారు. మొసలి కడుపులో ఉన్న బాలుడు బయటకి వస్తాడన్న నమ్మకంతో, అన్ని గంటల పాటు మొసలి నోరు మూయకుండా కట్టడి చేశారు. చంబల్‌ నదిలోకి స్నానం చేసేందుకు బాలుడు దిగాడని, ఆ సమయంలో మొసలి మింగేసిందని గ్రామస్థులు వాదిస్తున్నారు. మరో విచిత్రం ఏంటంటే మొసలి కడుపులో ఆ బాలుడు బతికే ఉన్నాడని ఫిక్స్ అయ్యారు అంతా. ఆ బాలుడి పేరు పిలుస్తూ, బదులు కోసం ఎదురు చూశారట. అప్పటికే అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు గ్రామస్థలకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. "మీరు అనుకున్నది సాధ్యం కాదు" అని వివరించారు.





 


"నదీ తీరంలో బాలుడు స్నానం చేస్తున్నాడు. ఉన్నట్టుండి మొసలి దాడి చేసింది. మొసలికి చిక్కకుండా ఉండేందుకు చాలా వేగంగా ఈదాడు. అయినా మొసలి బాలుడిని పట్టుకుంది.  ఆ సమయంలో పిల్లాడు గట్టిగా అరిచాడు. వెంటనే మేమంతా ఇక్కడికి వచ్చాం" అని  వివరిస్తున్నారు స్థానికులు. వలల సాయంతో మొసలిని పట్టుకున్నారు. గ్రామస్థులకు నచ్చచెప్పి మొసలిని నీళ్లలో వదిలే సరికి, అధికారుల తలప్రాణం తోకకు వచ్చింది. అయితే మరుసటి రోజు ఆ బాలుడి మృతదేహం నదిలో కనిపించింది.