Criticism against Chandrababu Naidu in Tamil Nadu: తమిళనాడులోని హోసూర్ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలన్న ప్రతిపాదనకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల అనుమతి నిరాకరించడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, ఈ పరిణామాన్ని కొందరు తమిళ నెటిజన్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ముడిపెడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారని, దానికి పోటీగా మారుతుందనే ఉద్దేశంతోనే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి హోసూర్ ప్రాజెక్టును అడ్డుకున్నారని కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. గతంలో వైజాగ్, విజయవాడ సర్వీసుల ఉదాహరణలను చూపుతూ, ఆశించిన స్థాయిలో ప్రయాణికులు లేకున్నా కుప్పంలో ఎయిర్‌పోర్ట్ అవసరమా అంటూ విమర్శలు చేస్తున్నారు. కేంద్ర ఏవియేషన్ మంత్రి కూడా టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు కావడంతో లింక్ పెడుతున్నారు. కానీ అనుమతులు తిరస్కరించింది రక్షణ శాఖ.
వాస్తవానికి, హోసూర్ ఎయిర్‌పోర్టుకు అనుమతి నిరాకరించడానికి గల కారణాలు పూర్తిగా సాంకేతికమైనవి. హోసూర్ ప్రాంతంలోని గగనతలం ప్రస్తుతం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నియంత్రణలో ఉంది. రక్షణ రంగ కార్యకలాపాలు, శిక్షణ , భద్రతా అవసరాల దృష్ట్యా ఈ ప్రాంతంలో పౌర విమానయానానికి అవకాశం లేదని రక్షణ శాఖ స్పష్టం చేసింది. గతంలోనూ ఇదే కారణంతో ప్రతిపాదనలు తిరస్కరణకు గురయ్యాయి. ఇది కేంద్ర రక్షణ శాఖ తీసుకున్న స్వతంత్ర నిర్ణయం తప్ప, ఇందులో పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్ర ఉండే అవకాశం లేదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
అంతేకాకుండా, హోసూర్ ఎయిర్‌పోర్ట్ నిలిచిపోవడానికి పరంధూరు విమానాశ్రయ వివాదం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. పరంధూరు వద్ద రెండో విమానాశ్రయం ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలను అక్కడి స్థానిక రైతులు దాదాపు 900 రోజులుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సమయంలోనే హోసూర్ వంటి ప్రత్యామ్నాయాలపై చర్చ జరుగుతున్నా, రక్షణ శాఖ భద్రతా కారణాలనే ప్రధానంగా ప్రస్తావిస్తోంది. కానీ, కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం లేదా అవగాహన లేమితో కుప్పం విమానాశ్రయంతో దీనికి లంకె పెడుతూ తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తున్నారు.
కుప్పం ఎయిర్‌పోర్ట్ అనేది ప్రధానంగా అగ్రికల్చరల్ ఎక్స్‌పోర్ట్ హబ్ వ్యవసాయ ఎగుమతుల కేంద్రం గా చంద్రబాబు భావిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు వేర్వేరు లక్ష్యాలతో, వేర్వేరు భౌగోళిక ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం కేవలం రాజకీయ విమర్శలకే ప్రాధాన్యత లభిస్తోంది. రక్షణ శాఖ అనుమతులు నిరాకరించడం వెనుక ఉన్న వాస్తవాలను పక్కనబెట్టి, వ్యూహాత్మకంగా చంద్రబాబుపై చేస్తున్న ఈ దుష్ప్రచారం ఇప్పుడు తెలుగు, తమిళ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
