CPI Narayana on YS Jagan KCR meeting: ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను కలవడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఓట్ల కోసమే కేసీఆర్‌ను జగన్ కలిశారని విమర్శలు చేశారు. వీళ్ల భేటీ వారి వ్యూహంలో భాగమే అని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా పార్టీని సిద్ధం చేసేందుకు సీపీఐ రాష్ట్ర సమితి సమావేశం గురువారం (జనవరి 4) నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కె.నారాయణ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు వారు ఏపీ పోలీసులు గొడవకు వచ్చినట్లుగానే... ఏపీ ఎన్నికల సమయంలోనూ ఇలాగే తనకు సహకరించాలని జగన్ కోరినట్లు నారాయణ విమర్శించారు. అప్పుడు నీకు సహకరించాను.. ఇప్పుడు మీరు నాకు సహకరించండి అని జగన్ అడిగారని, అందుకే వచ్చారని నారాయణ విమర్శించారు.


ఎన్నికల్లో సాయం‌ కోసమే జగన్.. కేసీఆర్ దగ్గరకి వచ్చారని అన్నారు. కేసీఆర్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని ప్రయత్నించి జగన్ విఫలమయ్యారని.. అందులో భాగంగానే పోలింగ్ రోజు నాగార్జున సాగర్‌లో లేని గొడవ సృష్టించారని నారాయణ అన్నారు. ఆ ప్లాన్ అట్టర్ ప్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ తన ఇంట్లో తన చెల్లెలితో గొడవలు పెట్టుకొని తన చేతులతో తానే నష్టం కొని తెచ్చుకుంటున్నారని అన్నారు. ఇంట్లో కుంపటి వ్యాఖ్యలు చేసి.. జగన్ తన ఓటమిని తానే ఒప్పుకున్నారని అన్నారు. ఇంట్లో గొడవలు సృష్టించుకుని ఇతరులను నిందిస్తే లాభం ఏంటని నిలదీశారు. చెల్లెలిని, బాబాయ్‌ను దూరం చేసుకున్నారని.. అలాగే అధికారానికి‌ కూడా దూరమవుతారని జగన్ వ్యాఖ్యలు చేశారు.


మొదటిసారి ఓటమి భయం


జగన్‌లో మెదటిసారి ఓటమి భయం కనిపిస్తుందని నారాయణ ఎద్దేవా చేశారు. అందుకే చంద్రబాబుపై కుటుంబాలను చీల్చుతున్నట్లుగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పొత్తు పేరుతో చంద్రబాబును బీజేపీ నష్టపరచాలని చూస్తోందని అన్నారు. తమను ప్రశ్నించిన వారిని కేంద్రం 17ఏ పేరుతో బెదిరిస్తోందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, జగన్‌ను కూడా 17ఏ తో బీజేపీ భయపెట్టిస్తోందని నారాయణ ఆరోపించారు.


రామమందిర ప్రారంభానికి వెళ్లం - నారాయణ


అయోధ్యలో రామమందిర నిర్మాణం రాబోయే ఎన్నికల కోసమేనని నారాయణ ఆరోపించారు. ఆ ప్రారంభోత్సవానికి తమకు కూడా ఆహ్వానం అందిందని, కానీ తాము వెళ్లడం లేదని తేల్చి చెప్పారు. మోదీ ఎన్నికల్లో లబ్ధి కోసం చేస్తున్న ఈ కార్యక్రమానికి తాము వెళ్లొద్దని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అడ్వాణీని పిలవకపోవడంపైనా నారాయణ స్పందించారు. మోదీ గ్రాఫ్ తగ్గకూడదనే.. అడ్వాణీని పిలవడం లేదని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన్ని ఉద్దేశపూర్వకంగా అడ్వాణీని రామ మందిరం ప్రారంభోత్సవానికి రావద్దని చెప్పారని అన్నారు. జనవరి 22 న అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించి ఓట్లు దండుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని నారాయణ వ్యాఖ్యలు చేశారు.