Covid Origins:
అమెరికన్ ఇంటిలిజెన్స్ రిపోర్ట్
కొవిడ్ వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే వచ్చిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అమెరికా ఇంటిలిజెన్స్ ఏజెన్సీస్ ఇచ్చిన రిపోర్ట్ తేల్చి చెప్పింది. నాలుగు పేజీల రిపోర్ట్‌ని తయారు చేసిన అధికారులు అసలు వాటికి ఆధారాలు సేకరించడమే కష్టంగా ఉందని వెల్లడించారు. సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీతో పాటు మరో ఏజెన్సీ కూడా ఈ విచారణ జరిపింది. ఆధారాలు సేకరించలేకపోయామని స్పష్టం చేసింది. ఈ విచారణ ఆధారంగానే...ల్యాబ్ నుంచి వైరస్ వచ్చిందన్నది కేవలం ఓ ఊహే అయ్యుండొచ్చని తెలిపింది. ఎంత శ్రమించినా ఏ ఎవిడెన్స్ లభించలేదని వివరించింది.
"వుహాన్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో అన్ని విధాలుగా విచారణ జరిపాం. అయినా మాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అక్కడి సిబ్బందే కావాలని అక్కడ వైరస్ తయారు చేసి లీక్ చేశారనడానికి రుజువులు లేవు. వీళ్లే కొవిడ్ ప్యాండెమిక్‌కి కారణం అని చెప్పడానికి మాకు ఎలాంటి కారణాలూ కనిపించలేదు"
- రిపోర్ట్
ఎన్నో వాదనలు..
నిజానికి చైనా ఆరిజిన్స్‌పై దాదాపు రెండేళ్లుగా భిన్న వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. వుహాన్‌లోని ల్యాబ్ నుంచే కావాలని లీక్ చేశారని కొన్ని దేశాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై అమెరికా చాలానే శ్రమ తీసుకుంది. కొవిడ్ మూలాలు కనుగొనేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది. అధ్యక్షుడు బైడెన్ కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారు. కానీ...సరైన ఆధారాలు దొరక్కపోవడం వల్ల చైనాపై పూర్తిగా నిందలు వేయడానికి వీల్లేకుండా పోయింది. అందుకే ఈ విషయంలో ఆచితూచి వ్యాఖ్యలు చేస్తోంది అమెరికా.
కుక్కల నుంచే వైరస్..?
కోవిడ్ వైరస్ వ్యాప్తికి కారణాలపై చాలాకాలం పరిశోధనలు సాగాయి. గబ్బిలాల ద్వారా ఈ వైరస్ వ్యాపించిందని ఇప్పటివరకూ అందరూ భావిస్తున్నారు. చైనాలోని వూహాన్ నుంచే ఈ వైరస్ ప్రారంభమైందని ఆధారాలున్నా.. దానికి ఏ జీవి కారణం అనే విషయంలో ఇప్పటివరకూ స్పష్టతలేదు. తాజాగా చైనాలోని వుహాన్‌లోని సీఫుడ్ మార్కెట్‌లో అక్రమంగా విక్రయిస్తున్న రాకూన్ జాతి కుక్కల నుంచి కోవిడ్ వైరస్ వ్యాపించిందని అంతర్జాతీయ నిపుణుల బృందం ఆధారాలు కనుగొందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొనడం కలకలం రేపుతోంది. కోవిడ్ మహమ్మారి మూలాల గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కోవిడ్ వైరస్ చైనాలోని వూహాన్‌లోని హువనాన్ మార్కెట్ నుంచి రాకూన్ జాతి కుక్కల ద్వారా సంక్రమించి ఉండవచ్చని అంతర్జాతీయ వైరస్ నిపుణుల బృందం పేర్కొంది. జనవరి 2020లో జన్యు డేటాను సేకరించడానికి ముందే.. వూహాన్ సీఫుడ్ హోల్‌సేల్ మార్కెట్ దాని పరిసర ప్రాంతాలను శుభ్రంచేశారు. చైనా అధికారులు మార్కెట్‌ను మూసివేసిన కొద్దిసేపటికే ఈ ఘటన జరగడం కొత్త వైరస్ వ్యాప్తికి సంబంధించిన అనుమానాలకు కారణమైంది.మార్కెట్ నుంచి జంతువులను తొలగించినప్పటికీ, శాస్త్రజ్ఞులు గోడలు, మెటల్ బోనులు, బండ్ల నుంచి జన్యు నమూనాలను సేకరించారు. పరీక్షల అనంతరం శాంపిల్స్‌లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విశ్లేషణలో పాల్గొన్న ముగ్గురు శాస్త్రవేత్తలు సేకరించిన జన్యు నమూనా జంతువులకు చెందినదని సూచించారు. అది సరిగ్గా రాకూన్ జాతి కుక్క అవశేషాలకు సరిపోయిందని ది అట్లాంటిక్ మ్యాగజైన్ వెల్లడించింది.