Kerala Covid Cases:



కేరళలో కొవిడ్ గుబులు..


కరోనా కేసులు (Covid Cases) మరోసారి గుబులు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, కేరళలో బాధితులు పెరుగుతున్నాయి. కేరళలో గత 24 గంటల్లోనే 293 కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం...రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,041 గా ఉంది. దేశవ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 341 మంది కొవిడ్ బారిన పడ్డారు. గత 24 గంటల్లో కేరళలో కొవిడ్ (Kerala Covid Cases) కారణంగా ముగ్గురు మృతి చెందారు. మూడేళ్ల క్రితం కరోనా వ్యాప్తి చెందినప్పటి నుంచి ఇప్పటి వరూ ఈ వైరస్‌ కారణంగా కేరళలో 72 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కేరళలో 241 మంది కొవిడ్ నుంచి కోలుకుని హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ అయినట్టు అధికారిక లెక్కలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా మరోసారి కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యవసర సమావేశం నిర్వహించింది. ముఖ్యంగా కేరళలోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్‌సుఖ్ మాండవియతో పాటు కేంద్రమంత్రులు ఎస్‌పీ సింగ్ భగేల్, భారతి ప్రవీణ్‌ కుమార్ హాజరయ్యారు. వీళ్లతో పాటు పలువురు ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. అటు కేరళ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రాష్ట్ర ఆరోగ్య శాఖమంత్రి వీణా జార్జ్ స్పందించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కొవిడ్ బాధితులకు ఐసోలేషన్ వార్డ్‌లు, గదులు, ఆక్సిజన్ బెడ్స్, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచేలా హాస్పిటల్స్‌కి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.