Corona Cases in India: 



7 నెలల రికార్డ్‌ దాటి..


భారత్‌లో గత 7 నెలల్లో ఎప్పుడూ లేని స్థాయిలో కరోనా కేసులు (Covid Cases in India) నమోదయ్యాయి. మే 21న ఎక్కువ కేసులు వెలుగులోకి రాగా..ఆ తరవాత డిసెంబర్ 22న ఒక్కరోజే 752 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 3 వేల మార్క్‌ దాటింది. కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం..ప్రస్తుతం 3,420 మంది బాధితులు కొవిడ్‌తో బాధ పడుతున్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ JN.1 తో ఉన్నట్టుండి వ్యాప్తి మళ్లీ పెరిగింది. అంతే కాదు. నలుగురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు కూడా. కేరళలో ఇద్దరు, రాజస్థాన్‌, కర్ణాటకలో ఒక్కొక్కరు మృతి చెందారు. గత 24 గంటల్లోనే నలుగురు బలి అవ్వడం కలవర పెడుతోంది. కరోనా వ్యాప్తి చెందినప్పటి నుంచి ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 5 లక్షల 33 వేలు దాటింది. ఇక మొత్తంగా కొవిడ్ బాధితుల సంఖ్య 4.50 కోట్లకు చేరుకుంది. ఆరోగ్య శాఖ లెక్కల ఆధారంగా చూస్తే...కేరళలో 266, కర్ణాటక 70, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 13, గుజరాత్‌లో 12 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ప్రభావం కనిపిస్తోంది. గత 24 గంటల్లో 325 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.


అటు బిహార్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అన్ని జిలాల్లో, ఆసుపత్రుల్లో టెస్టింగ్ సంఖ్య పెంచాలని అధికారులకు ఆదేశించింది. పట్నా, గయ, దర్బంగ ఎయిర్‌పోర్ట్‌ల నుంచి వచ్చే వాళ్లకు ర్యాండమ్‌గా కొవిడ్ టెస్ట్‌లు చేయాలని స్పష్టం చేసింది. కేసులు పెరిగినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన పని లేదని, మాస్క్‌లు ధరించి జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. డిసెంబర్ 21 నాటికి దేశవ్యాప్తంగా 22 JN.1 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 19 కేసులు ఒక్క గోవాలోనే ఉన్నాయి. మూడు నెలలకోసారి హాస్పిటల్‌లోని వసతులను రివ్యూ చేసుకోవాలని సూచించింది కేంద్ర ఆరోగ్య శాఖ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాలని తెలిపింది. ప్రస్తుతానికి JN.1 Variant ని ప్రపంచ దేశాలు పరిశీలిస్తున్నాయని, మరీ ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైతే కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఈ వేరియంట్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. JN.1 వేరియంట్‌ని "Variant of Interest" గా ప్రకటించింది. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే...ఓ వేరియంట్‌ ఇమ్యూనిటీ వలయాన్ని దాటుకుని మరీ వ్యాప్తి చెందడం. ఎప్పటికప్పుడు వైరల్ లక్షణాలనూ మార్చేస్తుందీ వేరియంట్. అందుకు తగ్గట్టుగానే వైద్యంలోనూ మార్పులు చేయాల్సి వస్తుంది. వ్యాక్సిన్‌లు కొత్తగా తయారు చేసుకోవాల్సిందే. అయితే...ప్రజల ప్రాణాలకు ప్రమాదం లేనప్పటికీ ఎక్కువ మందికి సోకే లక్షణముంటుంది ఈ వేరియంట్‌కి. నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం..ఈ వైరస్ స్ట్రెయిన్ చాలా సులభంగా రోగ నిరోధక శక్తిని ఛేదించుకోగలదు. అంతే కాదు. అంతే సులభంగా ఇతరులకు వ్యాప్తి చెందుతుంది.


Also Read: లోక్‌సభ ఎన్నికల ఎజెండాపై కాంగ్రెస్ కసరత్తు, మేనిఫెస్టో బాధ్యతలు తీసుకున్న చిదంబరం