Case Against Madhya Pradesh Minister For Remarks On Colonel Sofiya Qureshi: కల్నల్ సోఫియా ఖురేషిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చిక్కుల్లో పడ్డారు. ఆయనపై పోలీసు కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. విజయ్ షాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని రాష్ట్ర పోలీసు చీఫ్‌ను కోర్టు ఆదేశించింది. కల్నర్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిషా
మధ్యప్రదేశ్‌లోని బీజేపీ మంత్రి కున్వర్ విజయ్ షా, కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె మతాన్ని, సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు. ఒక బహిరంగ సభలో మన ఆడబిడ్డల సిందూరాన్ని చెరిపేసిన వారి అంతు చూడాలని, వారి వర్గానికి చెందిన సోదరిని మోడీ పంపారని వ్యాఖ్యానించారు. మన హిందువుల బట్టలు విప్పిన వారి జాతి బిడ్డను ప్రతీకారం తీర్చుకోవడానికి పంపించామని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు సోఫియా ఖురేషీ మతం, గుర్తింపును దెబ్బతీసేలా, ఆమెను అవమానకరంగా చిత్రీకరించేలా ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
పాకిస్తాన్ తో యుద్ధ సమయంలో కీలక పాత్ర
కల్నల్ సోఫియా ఖురేషీ భారత సైన్యంలో ఉన్నత స్థానంలో ఉన్న ఒక గౌరవనీయ అధికారి. ఆమెను మత కోణంలో చిత్రీకరించడం, ఆమె మతాన్ని లక్ష్యంగా చేసుకోవడం తీవ్రమైన మతవిద్వేష ధోరణిని ప్రతిబింబిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి పలువురు రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఈ వ్యాఖ్యలను ఖండించారు. కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
తప్పుగా అర్థం చేసుకున్నారన్న మంత్రి తన మాటలు తప్పుగా అర్థంచేసుకున్నారని వివాదం రేగడంతో మంత్రి వివరణ ఇచ్చారు. తాను ఆమెను ఏమీ అనలేదని ఉగ్రవాదాన్ని ఖండిస్తూ, దేశ భద్రత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న కృషిని హైలైట్ చేసినట్లు పేర్కొన్నారు. సోఫియా పేరు లేదా మతాన్ని నేరుగా ప్రస్తావించలేదని, విపక్షాలు తన మాటలను వక్రీకరించాయని ఆరోపించారు. కానీ వీడియోలు స్పష్టంగా ఉండటంతో కేసు నమోదు చేయమని కోర్టు ఆదేశించింది.