Cough Syrup Death:


ఉజ్బెకిస్థాన్‌లో చిన్నారులు బలి..


భారత్‌కు చెందిన సంస్థ తయారు చేసిన కాఫ్ సిరప్ కారణంగా చిన్నారులు మరణించారంటూ ఉజ్బెకిస్థాన్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై వెంటనే కేంద్రం అప్రమత్తమైంది. దీనిపై పూర్తి స్థాయి నివేదిక అందించాలని ఆ కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. నోయిడాకు చెందిన ఓ ఫార్మా కంపెనీ ఈ సిరప్‌ను తయారు చేసినట్టు సమాచారం. ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య శాఖ ఇప్పటికే ఈ ఘటనపై చాలా సీరియస్‌గా ఉంది. ఆ దగ్గు మందు తాగడం వల్ల 18 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని మండి పడుతోంది. ఇటీవలే గాంబియాలోనూ ఇదే తరహా మరణాలు సంభవించాయి. ఆ ప్రభుత్వం కూడా ఇండియన్ కంపెనీ తయారు చేసిన దగ్గు మందుపైనే ఆరోపణలు చేసింది. దీనిపై విచారణ కొనసాగు తుండగానే...ఉజ్బెకిస్థాన్‌లోనూ కలవరం మొదలైంది. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం విచారణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. నోయిడాకు చెందిన ఆ కంపెనీపై నిఘా పెట్టాలని తేల్చి చెప్పింది. సెంట్రల్ డ్రగ్స్ రెగ్యులేటరీ బృందం ఇప్పటికే ఈ పనిలో నిమగ్నమైంది. యూపీ డ్రగ్స్ లైసెన్సింగ్ అథారిటీ అధికారులను సంప్రదించింది. విచారణలో ప్రాథమికంగా తేలిన విషయం ఏంటంటే...ఏ సిరప్ అయితే తాగి చిన్నారులు మరణించారో...ఆ సిరప్‌ను భారత్‌ మార్కెట్‌లు విక్రయించడం లేదు. ఇక్కడ వినియోగించేందుకు పనికి రాని సిరప్‌లను విదేశాలకు తరలించి అక్కడ విక్రయిస్తున్నారు. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ఆధారంగా చూస్తే...ఆ కంపెనీ పేరు Marion Biotech. 2012లోనే ఈ కంపెనీ ఉజ్బెకిస్థాన్‌లో రిజిస్టర్ అయింది. ఈ సంస్థ తయారు చేసిన Dok-1 Max సిరప్ కారణంగానే చిన్నారులు 
ప్రాణాలు కోల్పోయారన్నది అక్కడి ప్రభుత్వం వాదన. 21 మంది చిన్నారులు ఈ సిరప్‌ తాగగా...వారిలో 18 మందికి శ్వాసకోశ ఇబ్బందులు వచ్చాయని వెల్లడించింది ఉజ్బెకిస్థాన్. 


మైడెన్‌పై కొరడా..


కొన్ని కాఫ్‌ సిరప్‌లు చిన్నారుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నాయని ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సంచనల ప్రకటన చేసింది. అంతే కాదు. మైడెన్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఫార్మా కంపెనీ నుంచి తయారైన నాలుగు రకాల దగ్గు, జలుబు మందులు పిల్లల మరణాలకు కారణం. ఈ మైడెన్ ఫార్మా కంపెనీ మన దేశానికి చెందినదే. పిల్లల మరణానికి కారణమైన ఆ నాలుగు మందులు ఇక్కడ తయారైనవే. గాంబియాలో 66 మంది పిల్లల మరణంతో ఇండియాలో తయారైన ఆ నాలుగు మందులను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిషేధించింది. ఈ ఘటనపై సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) వెంటనే దర్యాప్తు ప్రారంభించింది. హర్యానాకు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేసిన ఈ మందులు విషపూరితమని వ్యాఖ్యానించింది. ఆ నాలుగు మందులు పిల్లల దగ్గు, జలుబుకు వాడే సిరప్‌లు. ఇప్పటికే భారత్‌లో దీనిపై పెద్ద కలవరమే రేగింది. WHO ప్రకటించిన వారం రోజులకే...దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి. హరియాణాలోని మైడెన్ ఫార్మా కంపెనీకి చెందిన ప్లాంట్‌ను మూసేసింది ప్రభుత్వం. అంతే కాదు. ఈ సిరప్ ఉత్పత్తిని ఇప్పటికిప్పుడు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. 


Also Read: Covid-19 Scare India: మరో ముగ్గురు విదేశీ ప్రయాణికులకు కరోనా పాజిటివ్, జీనోమ్ సీక్వెన్సింగ్‌కు శాంపిల్స్