సాధారణంగా పువ్వులంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. వాటి అందమైన రూపంతోపాటు పుష్పాల నుంచి వచ్చే సుగంధాన్ని ఎంతో ఆస్వాదిస్తుంటారు. మామూలుగా పువ్వులు అంటే మంచి వాసనతో చూడడానికి అందంగా ఉంటాయని తెలిసిన విషయమే. కానీ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ అరుదైన పుష్పం వికసించింది. ఇది చాలా పెద్దది. మనిషి కంటే ఎత్తుగా ఉంటుంది. కొన్నేళ్లకొకసారి మాత్రమే పూస్తుంది. అంతేకాకుండా మరో ప్రత్యేకత కూడా ఉంది. అన్ని పూలలాగా ఇది మంచి వాసన మాత్రం వెదజల్లదు. కుళ్లిన మాంసం వాసనలా విపరీతమైన దుర్గంధం వెదజల్లుతుంది. కాకపోతే దీన్ని చూడడానికి మాత్రం జనాలు బారులు తీరుతున్నారు.
ఈ పువ్వు శాస్త్రీయ నామం అమోర్ఫోఫాల్లస్ టైటానియం. లాస్‌ఏంజెల్స్ సమీపంలోని హంటింగ్డన్ లైబ్రరీ వద్ద ఈ అరుదైన పుష్పం ఈ వారంలో పూసింది. కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పుష్పించే పువ్వు అయినందున దీన్ని చూడడానికి సందర్శకులు క్యూ కడుతున్నారు. ఈ పువ్వు కుళ్లిన మాంసం లాంటి దుర్గంధాన్ని వెదజల్లుతుందని అక్కడి గార్డెనర్ బ్రైసీ డూన్ తెలిపారు. ఈ పువ్వు క్యారియాన్ ఫ్లైస్(ఈగలు)ను ఆకర్షిస్తుందని, ఎక్కువ వాసన వస్తే ఎక్కువ ఈగలు వస్తాయని అన్నారు.
పుష్పం వికసించిన తర్వాత 48 గంటలు మాత్రమే తాజాగా ఉంటుందని, తర్వాత ఇది వాడిపోతుందని డూన్ వెల్లడించారు. చాలా తక్కువ సమయం మాత్రమే ఇది వికసించి ఉంటుందని, కానీ చూడడానికి ఇది చాలా బాగుంటుందని ఎంతో మంది దీన్ని చూడడానికి వస్తుంటారని అన్నారు. అరుదైన పుష్పం వికసించడం చూడడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన మీడియాతో చెప్పారు. పాల్ రుల్‌మెహర్ అనే పేరు దీనికి సరైనదిగా లేదని, అలా అని అది శవంలా ఉందని కూడా తాను చెప్పనని అన్నారు. ఇది ఎక్కువగా చెత్తకుప్పలా అనిపిస్తుందని తెలిపారు. ప్రజలు దీనికి కార్ప్స్ ఫ్లవర్(శవం పువ్వు)గా పిలుస్తారు. పువ్వు విపరీతమైన దుర్వాసన వెదజల్లుతున్నప్పటికీ సోమవారం దీనిని చూడడానికి చాలా మంది సందర్శకులు వచ్చారు.