Coronavirus Cases: భారత దేశంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వేగంగా కోరనా వ్యాప్తి చెందుతూ.. ప్రజలందరినీ విపరీతంగా భయ పెడుతోంది. ప్రపంచ ఆరోగ్య శాఖ ప్రకారం.. గత 24 గంటల్లో భారత దేశంలో 10,158 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశం మొత్తం యాక్టివ్ గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 44,998. ఏప్రిల్ 11వ తేదీ మంగళ వారం రోజుతో పోలిస్తే.. ఏప్రిల్ 12వ తేదీ బుధవారం రోజున కేసుల సంఖ్య మరింతగా పెరిగింది. మంగళ వారం రోజు కేవలం దేశంలో మొత్తం 7,830 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఒమిక్రాన్ లాంటి వేరియంట్ల కేసులు నమోదు అవుతున్నప్పటికీ, కొన్ని రోజుల్లో కరోనా తగ్గు ముఖం పడుతుందని వైద్య వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే కొవిడ్ 19 ఎండెమిక్ దశకు చేరుకుంటుందని వైద్య నిపుణులు బుధవారం తెలిపారు. కొన్ని ప్రాంతాల్లోనే కరోనా వ్యాప్తి ఉంటుందని అన్నారు.


కరోనా వ్యాప్తి తగ్గుతుందనడంతో కలుగుతున్న ఊరట


మరో 10 నుంచి 12 రోజులపాటు దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరో రెండు వారాల తరువాత దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి చాలా మేరకు తగ్గుతుందని వైద్య నిపుణులు వెల్లడించడం ఊరట కలిగిస్తోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 వేరియంట్‌ ప్రస్తుతం కరోనా వ్యాప్తికి కారణం అన్నారు. కరోనా వ్యాప్తి వేగంగా జరిగి, కేసులు భారీగా నమోదవుతున్నా ఆందోళన అవసరం లేదన్నారు. ఆసుపత్రుల్లో చేరికలు, మరణాలు చాలా తక్కువ మోతాదులో ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. .  


ఇప్పటి వరకు 220.66 కోట్ల టీకా డోసుల పంపిణీ


గత ఏడాది సెప్టెంబర్ 1న దేశంలో ఒకేరోజు 7,946 కోవిడ్-19 కేసులు నమోదు అయ్యాయి. మ‌ళ్లీ సుమారు 7 నెల‌ల త‌ర్వాత ఆ స్థాయిలో కేసులు న‌మోద‌వ‌డం ఇదే తొలిసారి. XBB1.16 వేరియంట్‌కు సంబంధించిన 1,774 కేసులు 22 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో గుర్తించారు. ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) డేటా ప్రకారం, వైర‌స్‌ సోకిన వారిలో 230 మందికి పైగా Omicron వేరియంట్‌కు చెందిన సబ్-వేరియంట్ XBB1.16.1 బారిన పడ్డారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, ఇప్పుడు మొత్తం యాక్టివ్ కేసులు 0.09 శాతం ఉన్నాయి, అయితే జాతీయ COVID-19 రికవరీ రేటు 98.72 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకూ 220.66 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.








తక్కువ సమయంలో ఎక్కువ నమోదు, విపరీతమైన మరణాలు


కరోనా లాంటి ఏదైనా వ్యాధులు తక్కువ సమయంలో ఎక్కువ నమోదు కావడం, మరణాలు సంభవిస్తే పాండమిక్ లేదా మహమ్మారి అని ప్రకటిస్తారు. కొంత కాలానికి వ్యాప్తి తగ్గుతుంది. ఈ సమయంలో కేవలం కొన్ని ప్రాంతాలకు కరోనా వ్యాప్తి పరిమితం కావడం, కేసులు నమోదైనా ప్రాణ నష్టం సైతం అతి తక్కువగా ఉండే ఈ స్థితిని ఎండెమిక్ స్టేజీ అంటారు. డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా, లాంటి వ్యాధులు త్వరగా వ్యాప్తి చెంది చివరకు ఎండెమిక్‌ వ్యాధులుగా గుర్తించారు.