Constitutional Amendment Bills  defeated:  మహిళా రిజర్వేషన్లు,  నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాంగసవరణ బిల్లు లోక్ సభలో వీగిపోయింది.  ప్రత్యేక మెజారిటీ 352 ఓట్లు లభించకపోవడంతో వీగిపోయినట్లుగా స్పీకర్ ప్రకటించారు.  బిల్లుకు అనుకూలంగా మెజారిటీ  298  సభ్యులు ఉన్నప్పటికీ, రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3 వంతు మద్దతును కూడగట్టడంలో ప్రభుత్వం విఫలమైంది.    బిల్లుపై జరిగిన చర్చలో హోం మంత్రి అమిత్ షా , విపక్ష నేతల మధ్య ఆసక్తికరమైన వాదనలు నడిచాయి. లోక్‌సభ స్థానాలు 50 శాతం  పెరుగుతాయని  గురించి స్పష్టత లేదని విపక్షాలు ప్రశ్నించగా.. ఇప్పుడే బిల్లులో ఆ మార్పు చేస్తే మద్దతిస్తారా  అని అమిత్ షా సవాల్ విసిరారు. దీనికి ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ సానుకూలంగా స్పందించినప్పటికీ, ప్రభుత్వం ఆ దిశగా వెనక్కి తగ్గకుండా నేరుగా ఓటింగ్‌కే మొగ్గు చూపడం గమనార్హం. ఈ పరిణామం ప్రభుత్వం పట్టుదలకు పోయిందా లేదా విపక్షాల చిత్తశుద్ధిని పరీక్షించాలనుకుందా అనే చర్చకు దారితీసింది.  

రాజ్యాంగ సవరణను ఆమోదించుకోవడానికి సాధారణంగా తెరవెనుక జరిగే దౌత్య ప్రయత్నాలు   ఈసారి ఎన్డీయే కూటమి పెద్దగా చేసినట్లు కనిపించలేదు. కేవలం సభా వేదికగా సభ్యులకు విజ్ఞప్తి చేయడమే తప్ప, తటస్థ పార్టీలను లేదా అసంతృప్త సభ్యులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేయకపోవడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది.   ప్రస్తుత రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో ప్రభుత్వం తన పంథాను మార్చుకుంది. 2023లో ఆమోదం పొందిన పాత మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా, డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్లను త్వరితగతిన అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.  

రాజ్యాంగంపై ప్రభుత్వం చేసిన దాడిని తాము అడ్డుకున్నామని రాహుల్ గాంధీ తర్వాత ప్రకటించారు. 

 మహిళలను కాంగ్రెస్ పార్టీ, విపక్షాలు మోసం చేశాయని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మండిపడ్డారు.