Gehlot Vs Pilot: 


రాజస్థాన్‌పై ప్రభావం...


హిమాచల్‌ ప్రదేశ్‌లో 40 సీట్లు దక్కించుకుని ఘన విజయం సాధించింది కాంగ్రెస్. వరుస అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూస్తున్న పార్టీకి...ఈ విజయం కాస్త ఊరటనిచ్చింది. ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని కొనసాగించారు హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ను సాధించింది. అయితే...ఈ విజయం రాజస్థాన్ రాజకీయాలపై ప్రభావం చూపనుంది. గుజరాత్‌లో దారుణమైన ఓటమిని చవి చూసింది కాంగ్రెస్. కనీసం 30 స్థానాల్లోనైనా గెలుస్తుందని అనుకున్నా..కేవలం 17 సీట్లకు పరిమితమైంది. మొట్టమొదటి సారి పోటీ చేసి 5 సీట్లకు పరిమితమైన ఆప్‌ కూడా ఓటు షేర్‌ బాగానే రాబట్టుకోగలిగింది. గుజరాత్ ఎలా చేయి జారి పోయింది. ఇప్పుడు అధికారంలో ఉన్న రాజస్థాన్‌నైనా కాపాడుకోవాలనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్. అందుకే...సీఎం అశోక్ గహ్లోట్, డిప్యుటీ సీఎం సచిన్ పైలట్‌పై అసెస్‌మెంట్‌ మొదలు పెట్టింది అధిష్ఠానం. అందుకు కారణం...గుజరాత్ ఎన్నికల బాధ్యతలను అశోక్ గహ్లోట్ తీసుకోవడం. అంత సీనియర్ నేత నేరుగా రంగంలోకి దిగినా...పార్టీ ఏ మాత్రం లాభ పడలేదు. అయితే...అటు హిమాచల్ ప్రదేశ్‌ ఎన్నికల బాధ్యతలను సచిన్ పైలట్ తీసుకున్నారు. అక్కడ పార్టీ భారీ విజయం సాధించింది. చెప్పాలంటే...హిమాచల్‌లో కాంగ్రెస్‌కు సచిన్ పైలట్ స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. ఎన్నికల వ్యూహాలు రచించడంలోనూ పైలట్ కీలక పాత్ర పోషించారు. ప్రియాంక గాంధీ కూడా ఆయనకు అండగా నిలిచారు.  తనదైన వ్యూహాలతో పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ప్రియాంక, సచిన్ పైలట్ కలిసి చాలా చోట్ల ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. ఫలితాల తరవాత...సచిన్‌ పైలట్‌కు వెయిటేజ్ పెరిగిపోయిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. 


పైలట్‌కు ప్రాధాన్యత..? 


ఈ గెలుపుతో...కాంగ్రెస్ అధిష్ఠానం సచిన్ పైలట్‌కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి. ఇదే జరిగితే...అశోక్ గహ్లోట్ పదవికి ఎసరు తప్పదు. అంతర్గత కలహాలతో రాజస్థాన్‌లోనూ అధికారాన్ని కోల్పోవడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. ఇలా జరగకుండా ఉండాలంటే...సచిన్‌ పైలట్‌ను రంగంలోకి దింపి, ఆయనకే రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పాలని అధిష్ఠానం భావిస్తుండొచ్చు. ఎలాగో...హిమాచల్ ఎన్నికలతో పైలట్ రిపోర్ట్‌ కార్డ్‌ వచ్చేసింది. ఈ పరిమామాలతో...గహ్లోట్ పొలిటికల్ ఇమేజ్ దెబ్బ తినేందుకు ఆస్కారముంటుంది. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో ఉన్న విభేదాలకు "సరైన పరిష్కారం" దొరుకుతుందన్న నమ్మకముందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు.  "రాజస్థాన్‌లో మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, పార్టీలోని అంతర్గత విభేదాలకు స్నేహపూర్వక పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నాను" ఆశాభావం వ్యక్తం చేశారు. ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్..సచిన్‌ పైలట్‌పై విరుచుకు పడ్డారు. "మోసగాడు" అంటూ పదేపదే పైలట్‌ను ఉద్దేశిస్తూ తీవ్రంగా మండి పడ్డారు. "ఓ మోసగాడు ఎప్పటికీ ముఖ్యమంత్రి అవ్వలేడు" అని నిప్పులు చెరిగారు. "పార్టీ అధిష్ఠానం సచిన్ పైలట్‌ను సీఎం చేయలేదు. ఆయనకు కనీసం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా లేదు. ఆయన పార్టీకి నమ్మకద్రోహం చేశారు. అతనో మోసగాడు" అని విమర్శించారు. 


Also Read: Gujarath Political News : సంబరపడాలా, జాగ్రత్త పడాలా? ఈ తీర్పు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతుందా ?