Congress Lok Sabha Elections Candidates List: కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. తొలి సమావేశంలోనే పేర్లను ఖరారు చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కీలకమైన 10 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాకి హైకమాండ్ ఆమోద ముద్ర వేసినట్టు సమాచారం. త్వరలోనే అధికారికంగా ఈ పేర్లను ప్రకటిస్తామని సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, లక్షద్వీప్‌ లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్టు తెలిపారు. అయితే...రాహుల్ గాంధీ ఈ సారి కూడా కేరళలోని వయనాడ్ నుంచే పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ రాజ్‌నందగావ్ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో మరి కొంతమంది కీలక నేతల్ని బరిలోకి దింపనుంది కాంగ్రెస్. కేరళలో మొత్తం 20 లోక్‌సభ నియోజకవర్గాలుండగా...16 చోట్ల తమ అభ్యర్థులను నిలబెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. వీళ్లలో ఎంపీ శశిథరూర్ కూడా ఉన్నారు. ఇక కర్ణాటక విషయానికొస్తే...రాష్ట్ర మంత్రులకు ఎంపీలుగా నిలబడే అవకాశం ఇచ్చేందుకు హైకమాండ్ ఆసక్తి చూపించడం లేదు. మంత్రులు కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు రావడం లేదు. డీకే శివకుమార్‌తో పాటు ఎంపీ డీకే సురేశ్ మాత్రమే బరిలోకి దిగే అవకాశాలున్నాయి. 


కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నియోజకవర్గమైన కల్‌బుర్గి విషయంలో మాత్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మరోసారి ఎలక్షన్ కమిటీ సమావేశపై దీనిపై నిర్ణయం తీసుకోనుంది. ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయా, త్రిపుర, సిక్కిం, లక్షద్వీప్‌లలో అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఇక సీట్ షేరింగ్ విషయంలోనూ కాంగ్రెస్ ఇంకా కసరత్తు చేస్తోంది. ఎంతో కీలకమైన మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మొత్తం 90 లోక్‌సభ నియోజకవర్గాలుండడం వల్ల కాంగ్రెస్ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బుజ్జగించే పనిలో ఉంది హైకమాండ్. I.N.D.I.A కూటమిలో కీలకమైన నేతగా ఉన్న దీదీతో విభేదాలు పెట్టుకోవడం అంత మంచిది కాదని భావిస్తోంది. 


లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్ధం చేస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీ హామీలు అందులో చేర్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా యువత, రైతుని దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించినట్టు సమాచారం. ప్రస్తుతం రాహుల్ గాంధీ నేతృత్వంలో మధ్యప్రదేశ్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతోంది. అక్కడే ఈ మేనిఫెస్టోని విడుదల చేసేందుకు అవకాశాలున్నాయి. 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, కనీస మద్దతు ధరపై చట్టం చేయడం, మహిళా రిజర్వేషన్‌లు, ముస్లింల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసే సచార్ కమిటీ ఏర్పాటు లాంటి హామీలు ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు ఎగ్జామ్స్‌లో పేపర్ లీక్‌ చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనలు తీసుకురానున్నట్టు సమాచారం.


Also Read: Layoffs 2024: ప్చ్ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో - లేఆఫ్‌లపై పెరుగుతున్న టెన్షన్