India Canada Tensions:
ట్రూడో ఆరోపణలు..
కెనడాలో ఖలిస్థాన్ వేర్పాటు వాది నిజ్జర్ హత్య వెనకాల భారత్ హస్తం ఉందని ఆ దేశ ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా దుమారం రేగుతోంది. ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించింది భారత్. అనవసరు ఆరోపణలు చేయడం సరికాదని మందలించింది. కానీ...ట్రూడో తీరు మాత్రం మారడం లేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తీవ్రంగా స్పందించింది. ఇప్పుడు ప్రతిపక్షాలూ ఈ విషయంలో కెనడాపై మండి పడుతున్నాయి. భారత్, కెనడా మధ్య ఈ వివాదం అదుపు తప్పకుండా చూసుకోవడం మంచిదని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు ఈ సమస్యను పరిష్కరించుకోవడం అవసరమని అన్నారు. కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలు చాలా షాకింగ్‌గా అనిపించాయన్న ఆయన...సాక్ష్యాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని మండి పడ్డారు.
"కెనడా ప్రధాని ట్రూడో భారత్‌పై చేసిన వ్యాఖ్యలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. అంత బహిరంగంగా భారత్‌పై ఆరోపణలు చేయడం సరికాదు. ఒకవేళ వాళ్ల దగ్గర సాక్ష్యాలు ఉండి ఉంటే కోర్టుకి ఇవ్వాల్సింది. నిందితులకు శిక్ష పడేలా చేయాల్సింది. కానీ ఇలా నిరాధారణ ఆరోపణలు చేయడం సరికాదు. ప్రస్తుతానికి భారత్ కెనడా మధ్య సంబంధాలు రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ప్రపంచ దేశాలన్నింటితోనూ మనకి ఆరోగ్యకరమైన మైత్రి ఉండాల్సిన అవసరముంది"
- శశి థరూర్, కాంగ్రెస్ ఎంపీ
సిక్కులపై ఉగ్రవాద ముద్ర..
కెనడాలో భారతీయుల సంఖ్య ఎక్కువే. వారిలో సిక్కులూ ఉన్నారు. వాళ్లందరిలోనూ భయం మొదలైంది. అటు రాజకీయంగానూ ఇది అనిశ్చితికి దారి తీస్తోంది. అకాలీ దళ్ అధ్యక్షుడు సుక్బీర్ సింగ్ కూడా ఈ వివాదంపై అప్రమత్తమయ్యారు. హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అవనున్నారు. సిక్కులపై ఉగ్రవాద ముద్ర పడుతోందని, ఇది సమాజానికి తప్పుడు సంకేతాలిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా ఈ సమస్య పరిష్కారమవ్వాలని ఆకాంక్షించారు.
"ఈ వివాదం భారత్ కెనడా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సిక్కులందరూ ఉగ్రవాదులే అన్న తప్పుడు సంకేతాలనూ ఇస్తోంది. దీన్ని కచ్చితంగా ఆపాలి. భారత ప్రభుత్వం, కెనడా ప్రభుత్వం ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి. వీలైనంత త్వరగా ఈ వివాదం సద్దుమణిగేలా చొరవ చూపించాలి. దేశ ప్రజలు దీని వల్ల ఇబ్బంది పడకూడదు. ప్రధాని మోదీకి నేను లేఖ రాస్తాను. పరిస్థితులు చేయి జారిపోతే భారత్‌లోని సిక్కులపైనా ఇది ప్రభావం చూపిస్తుంది"
- సుక్బీర్ సింగ్ బాదల్, అకాలీ దళ్ ప్రెసిడెంట్
పాకిస్థాన్ హస్తం..?
భారత్, కెనడా మధ్య వివాదం ముదురుతున్న క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అల్లర్ల వెనక పాకిస్థాన్ హస్తం కూడా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నిఘా వర్గాలు కూడా ఇదే చెబుతున్నాయి. కెనడాలో పాకిస్థాన్‌కి చెందిన ISIతో పాటు ఆ దేశ నిఘా వర్గం కూడా ఉందని...ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తున్నాయని సమాచారం. ఓ చోట రహస్యంగా ఖలిస్థాన్ టెర్రర్ గ్రూప్‌ల చీఫ్‌లతో భేటీ అయినట్టు తెలుస్తోంది. Sikhs for Justice (SFJ) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నన్ కూడా ఈ మీటింగ్‌కి హాజరయ్యారని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆయనతో పాటు మరి కొందరు కీలక నేతలు హాజరైనట్టు తెలుస్తోంది. అయితే...5 రోజుల క్రితమే ఈ రహస్య సమావేశం జరిగింది. ISI ఏజెంట్స్, ఖలిస్థాన్ గ్రూప్‌ల భేటీ అజెండా కూడా తెలిసింది. వీలైనంత వరకూ భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారట. దీనికే Plan-K అని పేరు కూడా పెట్టుకున్నట్టు సమాచారం.
Also Read: కెనడాలోని హిందువులంతా జాగ్రత్త, దాడులు జరిగే ప్రమాదముంది - కెనడా ఎంపీ హెచ్చరికలు