Complaint on PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్ష నేతలంతా కలిసి చొరబాటుదారులైన ముస్లింలకే సంపదంతా దోచి పెడతారని ఆయన చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్ సహా మిగతా పార్టీలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున ఇప్పటికే ఎన్నికల సంఘానికి 17 ఫిర్యాదులు అందాయి. సీనియర్ కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ ఈ విషయం వెల్లడించారు. ప్రధాని మోదీపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా ఓ మతాన్ని ఉద్దేశిస్తూ అనుచితంగా మాట్లాడడం దురదృష్టకరం అని అసహనం వ్యక్తం చేశారు. ఆయన ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని అడిగారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించారు.
"ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తరపున 17 ఫిర్యాదులు అందించాం. అన్నింటినీ సీరియస్‌గా తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరాం. ప్రధాని వ్యాఖ్యలపై ఈసీ కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఓ మతం పేరుని ప్రస్తావిస్తూ ఇలా మాట్లాడడం దురదృష్టకరం. చొరబాటుదారులకు కాంగ్రెస్ అన్నీ దోచిపెడుతున్నారనడం సరికాదు. ఇలా వ్యాఖ్యలు చేయడం అంటే ఎన్నికల నియమావళిని ఉల్లంఘిచినట్టే. వీలైనంత త్వరగా ఆయనపై చర్యలు తీసుకోవాలి"
- అభిషేక్ మను సింఘ్వీ, కాంగ్రెస్ సీనియర్ నేత