Rahul Gandhi on Modi: భారతదేశం గురించి విదేశాల్లో అవమానపరిచేలా మాట్లాడుతున్నారని బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను రాహుల్ గాంధీ తిప్పికొట్టారు. విదేశీ గడ్డపై తాను ఎప్పుడూ భారత్ ను అవమానపరచలేదని, ఆ పని ప్రధాని మోదీనే చేశారని రాహుల్ అన్నారు. నాకు గుర్తున్నాయ్ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. భారత్ కు స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని ఏళ్లలో దేశంలో ఏ అభివృద్ది జరగలేదని విదేశీ గడ్డపై ప్రధాని మోదీ పేర్కొనడం తనకు గుర్తుందని రాహుల్ అన్నారు. ఆ కాలంలో అపరిమిత స్థాయిలో అవినీతి జరిగిందని మోదీ చెప్పడం గుర్తుందని తెలిపారు. తానెప్పుడు దేశం పరువు తీయలేదని, తీయాలన్న ఉద్దేశం, ఆసక్తి కూడా తనకు లేదని, తన మాటలను వక్రీకరించడం బీజేపీ నాయకులకు ఇష్టమని రాహుల్ అన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు భారత్ పరువు తీసేది ప్రధాన మోదీ అన్నది వాస్తవమని పేర్కొన్నారు. 'స్వాతంత్య్ర వచ్చిన దగ్గరి నుంచి భారత్‌లో ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదని ప్రధాని చేసిన ప్రసంగం మీరు వినలేదా?' అని రాహుల్ ప్రశ్నించారు. మోదీ తన మాటలతో భారతీయులను అవమానపరిచారని రాహుల్ మండిపడ్డారు.
కేంబ్రిడ్జిలో రాహుల్ గాంధీ
రెండ్రోజుల క్రితం కేంబ్రిడ్జి బిజినెస్ స్కూల్‌లో రాహుల్ మాట్లాడుతూ మోదీ సర్కారుపై విమర్శలు చేశారు. భారతీయ ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందని అన్నారు. సమంజసం కాని క్రిమినల్ కేసుల భయం ప్రతిపక్ష నేతలను వెంటాడుతోందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రాథమికాంశాలైన పార్లమెంటు, స్వేచ్ఛాయుత పత్రికా రంగం, న్యాయ వ్యవస్థ ఆంక్షలను ఎదుర్కొంటున్నాయని రాహుల్ విమర్శించారు. తనతోపాటు చాలా మంది రాజకీయ నేతలపై నిఘా పెట్టేందుకు ఇజ్రాయిల్ స్పైవేర్ పెగాసస్ ను భారత దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తోందని రాహుల్ అన్నారు. ఫోన్ లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్ అధికారులు తనకు చెప్పారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ లో చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. పొరుగు దేశం పాక్ సైతం ఎప్పుడూ ఆ సాహం చేయలేదని బీజేపీ పేర్కొంది.
2015లో దుబాయ్ లో మోదీ..
ఎలాంటి నిర్ణయాలు తీసుకోని గత ప్రభుత్వం నుంచి వచ్చిన సమస్యలు ఉన్నాయంటూ 2015లో దుబాయ్ లో మోదీ కాంగ్రెస్ సర్కారు పాలనపై విమర్శలు చేశారు. గతంలో భారతీయులు దేశంలో జన్మించినందుకు చింతిస్తూ.. దేశం విడిచివెళ్లిపోయే పరిస్థితి ఉండేదని, కానీ ప్రస్తుతం మాత్రం ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆదాయం తక్కువైనా వారంతా స్వదేశానికి రావడానికి మొగ్గు చూపుతున్నారని అన్నారు. ప్రజల ఆలోచన మారిందంటూ మోదీ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. ప్రస్తుతం ఆనాడు మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ నేతలపై, సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. నాకు గుర్తుంది అంటూ ఆనాడు మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ మోదీపై, బీజేపీ నాయకులపై మండిపడ్డారు.