Himachal New CM Sukhwinder Singh:
సుఖ్వీందర్ సింగ్ వైపు మొగ్గు..
హిమాచల్ ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న సందిగ్ధత వీడినట్టే కనిపిస్తోంది. ఈ రేసులో నలుగురు సీనియర్ నేతలు ఉండగా...ప్రతిభా సింగ్ పేరుని ముందే అధిష్ఠానం పక్కన పెట్టింది. ఆ తరవాత సుఖ్వీందర్ సింగ్ సుకును సీఎం చేయాలని అధిష్ఠానం ఆమోదించినట్టు తెలుస్తోంది. మొదటి నుంచి పెద్దలంతా ఆయన పేరునే ప్రతిపాదించారట. ప్రతిభా సింగ్ తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పినప్పటికీ..అధిష్ఠానం పట్టించుకోలేదు. అయితే...అందరి నేతలతో మాట్లాడి, ఒప్పించి చివరకు సుఖ్వీందర్ సింగ్ పేరుని ఖరారు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇవాళ సాయంత్రానికి అధికారికంగా ఆయన పేరు ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం. అయితే..దీనిపై సుఖ్వీందర్ సింగ్ స్పందించారు. "నాకెలాంటి సమాచారం అందలేదు. ఉన్నట్టుండి సీఎల్‌పీ మీటింగ్ రద్దు చేశారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న స్ఫష్టత లేదు" అని అన్నారు. అంతకు ముందు జరిగిన సమావేశంలో...సుఖ్వీందర్ సింగ్‌కు దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలబడ్డారు. ఆయననే సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సమాచారం ప్రకారం చూస్తే...ఆయనే హిమాచల్ ప్రదేశ్‌కు కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నిక కానున్నట్టు తెలుస్తోంది.
ప్రతిభా సింగ్ విషయంలో కాంగ్రెస్ పెద్దలు వెనకడుగు వేయడానికి ఓ ప్రధాన కారణముంది. మండి నియోజకవర్గానికి ప్రతినిధిగా ఉన్న ఆమెకు సీఎం పదవి అప్పగిస్తే ఆ సీట్ ఖాళీ అవుతుంది. ఇప్పటికిప్పుడు మళ్లీ ఉప ఎన్నికలు పెట్టక తప్పదు. కానీ...ఈ ప్రాంతంలోని 10 సీట్లలో కాంగ్రెస్ 9 స్థానాలు కోల్పోయింది. ఇలాంటి సమయంలో మళ్లీ అక్కడ ఎన్నికలు పెట్టి ఓడిపోవడం ఎందుకు అన్న ఆలోచనలో ఉంది కాంగ్రెస్. అదీ కాకుండా...ప్రతిభా సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌కు కేబినెట్‌లో ఉన్నత పదవి ఇవ్వాలని భావిస్తోంది. అందుకే...ప్రతిభా సింగ్‌ను పక్కన పెట్టనుంది.