Essential Commodities Prices Hike: రోజురోజుకూ నిత్యావసరాల (Essential Commodities) ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బియ్యం (Rice), కోడిగుడ్డు (Egg), వంటనూనె (Cooking Oil), కూరగాయల ధరలు అమాంతం పెరగిపోవడంతో సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికంగా పోషకాలు ఉండే గుడ్డు సైతం రూ.4 నుంచి రూ.6కు పెరగడంతో కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల టమోటా ధరలు మోత మోగించాయి. ఆ బాటలోనే కొద్ది రోజులు ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టించాయి. ఇప్పుడు పప్పు ధాన్యాల నుంచి ఉప్పు, కూరగాయల ధరలు అధికంగా పెరగడంతో కుటుంబాన్ని నెట్టుకురావడం సామాన్యునికి సవాల్ గా మారింది.


జీతం అలా.. ధరలు ఇలా


కూలీ పనులు, చిరుద్యోగులు తమకు జీతాలు పెరిగేందుకు సంవత్సరాలు పడుతుంటే, రోజుల వ్యవధిలోనే నిత్యావసరాల ధరలు పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. తాము ఏం తిని బతకాలని వాపోతున్నారు. పట్టణాల్లో భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తున్నా ధరలు పెరుగుదలతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.


బియ్యం ధరలకు రెక్కలు


సెప్టెంబర్, అక్టోబర్ లో బియ్యం ధరలు కాస్త అదుపులోనే ఉన్నప్పటికీ నవంబర్ నుంచీ పెరుగుతూ వస్తున్నాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్దందులు పడుతున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్, దిగుబడి తగ్గడం, త్వరలో శుభకార్యాలు ఎక్కువగా ఉండడం వంటి కారణాలతో దొడ్డుబియ్యంతో పాటు సన్నబియ్యం ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. దీంతో సామాన్యులు దొడ్డుబియ్యం వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కాగా, భవిష్యత్తులోనూ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. 


ఉల్లి కాస్త ఊరట


ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. సామాన్యులకు ప్రతి రోజూ ఉల్లి వినియోగం ఎక్కువగా ఉంటుంది. కాగా, నెల రోజుల క్రితం కిలో రూ.100 ఉన్న ఉల్లి ప్రస్తుతం రూ.25 నుంచి రూ.30కు చేరింది. దీంతో సామాన్యులకు కాస్త ఊరట లభించినట్లైంది. తోపుడు బండ్లు, ఆటోలపై వ్యాపారస్తులు కిలో రూ.10 చొప్పున విక్రయిస్తున్నారు. మరోవైపు, మిగిలిన కూరగాయలు సైతం ధరలు పెరిగాయి.


వంటనూనెల పరిస్థితి ఇదీ


అటు, సామాన్యుల నిత్యావసరమైన వంటనూనెల ధరలు సైతం అమాంతం పెరిగాయి. వారం రోజుల్లో కిలో నూనె రూ.20కి పెరిగింది. గతంలో మార్కెట్లో రూ.100 ఉన్న నూనె ప్రస్తుతం రూ.120 నుంచి రూ.125 వరకూ వ్యాపారులు విక్రయిస్తున్నారు. కేంద్రం నూనె గింజల రైతులను ఆదుకునేందుకు భారీగా ట్యాక్స్ పెంచడంతో రిటైల్ మార్కెట్లో ఒక్కసారిగా ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దిగుమతి సుంకాన్ని కారణంగా చూపుతూ వ్యాపారులు కిలోకు రూ.10 ఎక్కువ విక్రయిస్తున్నారు.


సామాన్యుని వినతి


గతంలో రూ.100కు సంచి నిండా కూరగాయలు వచ్చే పరిస్థితి ఉందని, ఇప్పుడు 3, 4 రకాలు కూడా రావడం లేదని సామాన్యులు వాపోతున్నారు. బియ్యం, వంటనూనె, పప్పులు, కూరగాయలు ఇలా నిత్యావసరాలు ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వాలు వీటి నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కీలకమైన పండుగ సమయాల్లో పేద, సామాన్య, మధ్య తరగతికి ధరలు అందుబాటులో  ఉండేలా చూడాలంటున్నారు. 


Also Read: Tirumala News: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్